ఎవరిమనస్తత్వం వారిది. కొందరు ఆల్‌రెడీ ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడం సేఫ్టీగా భావిస్తారు. కానీ రీమేక్‌లోని ఆత్మను పట్టుకోకపోతే దారుణపరాజయాలు ఎదురవుతాయని కూడా చరిత్ర చెబుతోంది. దీనికి ఓ మంచి ఉదాహరణ వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కన్నడ రీమేక్ ‘యోగి’. రీమేక్ చిత్రాలలోని ఆత్మను పట్టుకుని దానిని మన తెలుగు వారికి నచ్చేలా అడాప్ట్ చేయడం అంత సులభం కాదు. గతంలో రీమేక్ చిత్రాలంటే వాటికి కొందరు స్పెషలిస్ట్ డైరెక్టర్లు ఉండేవారు. రవిరాజా పినిశెట్టి, భీమనేని శ్రీనివాసరావు వంటి వారు అందరు సిద్దహస్తులుగా పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి స్ట్రెయిట్ ఓరిజినల్ చిత్రం చేయడం కష్టమా? రీమేక్ చేయడం కష్టమా? అనేది ఆయా దర్శకుల అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందునా ఒకప్పుడు సోషల్‌మీడియా ప్రభావం పెద్దగా లేదు.
కానీ నేడు అది కాదు. ప్రతి భాషలో హిట్టయిన చిత్రాలు ప్రేక్షకులకు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. నెటిజన్లు వాటిని చూసేస్తున్నారు కాబట్టి మరింత బెటర్‌గా తీయందే వీలుకాదు. కాపీ పేస్ట్ చేయడానికి వీలు కుదరడం లేదు. ముఖ్యంగా ఏదైనా చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారని తెలిస్తే నెటిజన్లు అందరు ఆయా చిత్రాలపై పడిపోతున్నారు. ఇక విషయానికి వస్తే తెలుగు దర్శకుల్లో హరీష్‌శంకర్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తీసిన అన్ని చిత్రాలు ఒక ఎత్తైతే ‘దబాంగ్’కి రీమేక్‌గా ఒరిజినల్ వెర్షన్‌లోని మెయిన్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని ఆయన ప్రేక్షకులను రంజింపచేసిన తీరు అద్భుతం.
పవన్‌కి అంతకు ముందు ఎంతో కాలంగా హిట్ లేకపోయినా మరలా పవన్ మేనియా స్టార్ట్ కావడానికి ‘గబ్బర్‌సింగ్’ కూడా ఓ కారణమని చెప్పవచ్చు. అలాంటి హరీష్‌శంకర్ ‘డిజె’ తర్వాత మరోసారి రీమేక్ తలుపులు తట్టాడు. తమిళంలో బాబిసింహా, సిద్దార్ద్ నటించిన ‘జిగర్‌తాండా’ని తెలుగులోకి ‘వాల్మీకి’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుంది. కాబట్టి ‘వాల్మీకి’ అనే టైటిల్ ఈచిత్రానికి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుందనే భావించాలి. ఒరిజినల్‌లో బాబిసింహా పోషించిన పాత్రను మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ చేస్తుండగా, సిద్దార్ద్ పాత్రను తమిళ నటుడు అధర్వ మురళి చేస్తూ ఉండటం విశేషం. తమిళ నటి మృణాళిని రవి కీలకపాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. ‘ఎఫ్2’ వంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న వరుణ్‌తేజ్ తదుపరి చిత్రంగా మరోసారి విభిన్న చిత్రం చేస్తూ ఉండటం విశేషం. నిజానికి మెగాహీరోలలో వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తున్న హీరో ఎవరు అంటే ఠక్కున వరుణ్‌తేజ్ అని చెప్పవచ్చు. ‘ముకుంద, కంచె, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్2’ ఇలా ఒక చిత్రానికి మరో చిత్రానికి సంబంధం లేకుండా ఆయన తన కెరీర్‌ని మలుచుకుంటున్నాడు.
ఇక తాజాగా ‘వాల్మీకి’ షూటింగ్ మొదలైంది. ‘వాల్మీకి మొదటి రోజు షూటింగ్... ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాను’ అని వరుణ్ తన ట్విట్టర్‌ఖాతా ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలోని వరుణ్‌తేజ్ లుక్‌ని కూడా తాజాగా విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, గిరజాల జుట్టు, నుదుటిపైన రేగిన హెయిర్, చెవిరింగుతో ఆయన మాస్‌కే మాస్ అనేలా, మాస్‌కా బాప్ అనేలా ఉన్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ లుక్‌లో ఆయన శ్వేదం కూడా చిందిస్తున్నాడు. ఈ లుక్ మెగాభిమానులనే కాదు.. సామాన్య ప్రేక్షకులను కూడా ఎంతో అలరించేలా ఉండటం విశేషం. వరుణ్ లుక్‌లో చూపించిన వైవిధ్యం, సినిమా అంతా హరీష్‌శంకర్ చూపించగలిగితే మరలా ఆయనకు పూర్వవైభవం వచ్చినట్లేనని చెప్పాలి.