కొందరు నిజాయితీగా సినిమాలను తీయాలని ఉంటే.. మరికొందరు సినిమా తీస్తామనే పేరుతో వివాదాలు సృష్టించడానికి, ఆ వివాదాల ద్వారా వార్తల్లో ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఇటీవల తమిళనాడు తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఓ రెండాకులు ఎక్కువే చదివానని నిరూపిస్తున్నాడు. తెలుగులో ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లుగా మూడు చిత్రాలు వచ్చాయి. బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కథానాయకుడు, మహానాయకుడు’లు టేకింగ్‌లో తప్పు లేకపోయినా కంటెంట్‌పరంగా ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. ఇక రాంగోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. తన చిత్రానికి ఆయన ఉచితంగా ప్రమోషన్స్ చేసిన తీరు అందులో ఏదో ఉంది అనే నమ్మకాన్ని కలిగించింది. కానీ విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత ఆ చిత్రం కూడా కలెక్షన్లు లేక కుదేలైంది. తాజాగా ఈ చిత్రం లాంగ్‌రన్ కూడా ముగిసింది.
ఇక ఇదే సమయంలో కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తాను‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రాన్ని తీయనున్నానని సంచలనం సృష్టించాడు. ఏవో ఒకటి అరా పోస్టర్లు రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఇక మన పక్కరాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే దివంగత అమ్మ జయలలిత మీద పలు బయోపిక్‌లు రూపొందుతున్నాయి. స్వయాన దాసరి నారాయణరావు, వర్మలు కూడా అమ్మ బయోపిక్‌లను తీస్తామని తెలిపారు. ఇక ‘ఐరన్‌లేడీ’ పేరుతో ఓ చిత్రం ప్రకటన వచ్చింది. మరోవైపు కంగనారౌనత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ అనే చిత్రం కూడా రూపొందనుంది. ఈ సందట్లో సడేమియాగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కూడా తాను అమ్మ బయోపిక్‌ని తీయబోతున్నానని, ఇందులో అమ్మ జయలలిత మరణంలో శశికళ పాత్రను చూపించే సత్తా, దమ్ము తనకే ఉన్నాయని ప్రకటించాడు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశాడు. ఇందులో జయలలిత, శశికళల మొహాలు సగం సగం ఉండేలా చూపించి ఇద్దరు ఒకరిలో ఒకరు అంతర్భాగం అనే ఫీల్‌ని కలిగించాడు. ఇక జయలలిత పాత్రకు బాలీవుడ్ స్టార్ కాజల్‌ని, శశికళ పాత్రకు అమలాపాల్‌ని సంప్రదిస్తున్నానని ఆయన తెలిపాడు. ఇది కేతిరెడ్డి జగదీశ్వరర్‌రెడ్డి మైలేజ్ కోసం, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేశాడనే భావన అయితే కలుగుతోంది గానీ ఇందులో నటించేందుకు అసలు కాజల్, అమలాపాల్ వంటి వారు ఒప్పుకుంటారా? అనే అనుమానాలు రాకమానవు. కాజల్, అమలాపాల్‌లను ఒప్పిస్తున్నానని చెప్పడంతోనే అందరిలో ఇది జరిగే పని కాదనే అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తానికి కేతిరెడ్డి జనాలను, మీడియాను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ పనిలో ఆయనే ఓ పిచ్చి మాలోకంలా మిగిలిపోతున్నాడనేది మాత్రం వాస్తవం.