సినీపరిశ్రమలో కొత్తవారి కథలను, ఐడియాలను సీనియర్లు కాపీ కొట్టడం అనేది తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు... సినీ చరిత్ర ఉన్నప్పటి నుంచి ఇది ఉంటూనే ఉంది. కానీ కొన్ని సార్లు బాధితులకు న్యాయం జరిగినా, ఎక్కువ సార్లు మాత్రం వారికి అన్యాయమే జరుగుతూ ఉంటుంది. ఒకరి కథను మరొకరు తీసుకుని పారితోషికం ఇస్తామని, టైటిల్స్‌లో క్రెడిట్ ఇస్తామని నమ్మించి, ఆ తర్వాత సైడైపోతూ ఉంటారు. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకు ఇదే తంతు. అయితే దీనిలో ఔత్సాహికులు అత్యుత్సాహం కూడా కొంపముంచుతూ ఉంటుంది. ఇక సినిమా కథలు మావి.. మా కథలను కాపీ కొడుతున్నారు.. అని పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలు వివాదంలో ఇరుక్కోవడం కూడా జరుగుతోంది. ఇది టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.
ఇటీవల రజనీ నటించిన ‘కబాలి, కాలా’ చిత్రాల విషయంలో కూడా ఇదే విషయంపై వివాదం చెలరేగింది. విజయ్-అట్లీల కాంబినేషన్‌లో రూపొందిన ‘మెర్సల్’ చిత్రం కథ కూడా తనదేనని ఓ యువ రచయిత నానా హడావుడి చేశాడు. ఇప్పుడు మరోసారి విజయ్ -అట్లీల చిత్రానికి అదే సమస్య వచ్చి పడింది. గతంలో ‘తేరీ, మెర్సల్’ వంటి విజయవంతమైన చిత్రాలను తీసిన విజయ్ -అట్లీల కాంబినేషన్‌లో ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీగా ఓ చిత్రం రూపొందుతోంది. విజయ్ 63గా ఈ చిత్రం ప్రచారం జరుగుతోంది. ఈ కథ ఫుట్‌బాల్ నేపధ్యంలో జరిగే చిత్రమని, అయినా ఇందులో వివాదాలకు, రాజకీయాలకు తావుండదని ఇటీవలే విజయ్ ప్రకటించాడు. ఇలా ఆయన ప్రకటించిన కొద్దికాలానికే ఈ చిత్రం కథ తనదేనని ఓ యువ దర్శకుడు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
తాను మహిళల ఫుట్‌బాల్ కథ నేపధ్యంలో ఓ స్టోరీ తయారు చేసుకున్నానని, దానిని ఎందరో నిర్మాతలకు వినిపించానని అతను వాదిస్తున్నాడు. తాను ఆ కథను చెప్పినప్పుడు విన్న ఎవరో నిర్మాత ఆ స్టోరీని అట్లీకి లీక్ చేశాడని, ప్రస్తుతం అట్లీ అదే కథతో విజయ్‌తో చిత్రం చేస్తున్నాడని ఆయన అంటున్నాడు. ఈ విషయంపై తాను అట్లీని, విజయ్‌ని కలిసి మాట్లాడాలని భావించినా వారు పట్టించుకోవడం లేదని, చివరకు రచయితల సంఘంకు ఫిర్యాదు చేసిన ఎవ్వరూ పట్టించుకోకపోవడంతోనే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వాదిస్తున్నాడు. మరి ఈ సమస్య నుంచి విజయ్, అట్లీలు ఎలా బయటపడతారు? ఆ యంగ్ డైరెక్టర్ కం రైటర్ చెప్పే వాదనలో నిజం ఉందా? లేదా? అనేది వేచిచూడాలంటే కొంత కాలం వెయిట్ చేయకతప్పదు.