అల్లువారి చిన్నబ్బాయ్ అల్లుశిరీష్ బాలనటునిగా ఒకటి రెండు చిత్రాలలో నటించినా హీరోగా ప్రకాష్‌రాజ్ ‘గౌరవం’తో ఎంటర్ అయ్యాడు. కానీ ఇప్పటివరకు ఈయనకు సరైన హిట్ లేదు. కేవలం పరుశురాం ‘శ్రీరస్తు.. శుభమస్తు’ మాత్రమే ఓకే అనిపించింది. మోహన్‌లాల్ నటించిన ‘1975 బియాండ్ బోర్డర్స్’ ద్వారా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన అన్నయ్య అల్లుఅర్జున్‌కి మల్లూవుడ్‌లో ఉన్న క్రేజ్ తనకి హెల్ప్ అవుతుందని ఆశించాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఇలా ఔరంగజేబులో దండయాత్రల మీద దండయాత్రలు చేస్తూనే సమయం కలిసి రావడం లేదు. అదే అతను అల్లువారి కాంపౌండ్ హీరో కాకుండా, వారసత్వ హీరో అవ్వకుండా ఉండి ఉంటే ఇప్పటికే ఆయన ఫేడవుట్ అయ్యేవాడు. చివరకు అల్లుశిరీష్ మలయాళంలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌కి మంచి హిట్ ఇచ్చిన ‘ఎబిసిడీ’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.
‘ఎబిసిడీ’ అంటే ‘అమెరికన్ బర్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ’. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 17న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రేమ, స్నేహం, హాస్య ప్రధానంగా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. బాల హాస్యనటునిగా ‘ఢీ, రెఢీ’తో పాటు పలు చిత్రాలలో నటించిన మాస్టర్ భరత్ ప్రస్తుతం మిస్టర్ భరత్ గా ఇందులో అల్లుశిరీష్‌కి స్నేహితునిగా కనిపించనున్నాడు. మాస్‌ని ఆకట్టుకునే విధంగానే గాక రాజకీయ కోణం కూడా ఈమూవీలో ఉందని అర్ధమవుతోంది. ఆల్‌రెడీ మలయాళంలో ప్రూవ్ సబ్జెక్ట్ కాబట్టి దీనిపై అల్లువారికి గట్టి నమ్మకమే ఉంది. ‘నేను లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్‌నే కోరుకుంటానని’ హీరో చెప్పే డైలాగ్‌ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ అర్ధమవుతోంది.
సురేష్‌ప్రొడక్షన్స్ సమర్పణలో మధురశ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేనండీ గురూజీ పొగడ్తల వర్షం కురిపించాడు. ఆయన మాట్లాడుతూ, ‘జల్సా’ చిత్రం సమయంలో అల్లుశిరీష్‌కి చిన్నకుర్రాడిగా చూశాను. అప్పట్లోనే అతనికి సినిమాలపై మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. సినిమాలను అర్ధం చేసుకుని ప్రేమించే వ్యక్తి శిరీష్. ఇలాంటి వారు ఎక్కువ చిత్రాలు చేయాలి. అప్పుడే మంచి చిత్రాలు వస్తాయి.. ట్రైలర్ బాగా నచ్చింది. డబ్బున్న కుర్రాడు పడే కష్టాలను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. ఇక భరత్‌కి నేను అభిమానిని, ఆయన కామెడీని నేను ఎంతో ఇష్టపడతాను. భరత్‌ని ఇలా చూడటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ గురూజీ అల్లువారిని ఆకాశానికి ఎత్తేశాడు.