ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన అభినేత్రి తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తమిళంలో దేవిగా విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్‌గా దేవి2ను రూపొందించారు. ఆ సినిమా తెలుగులో అభినేత్రి 2గా మే ఒకటిన విడుదల కానుంది. మంగళవారం మధ్యాహ్నం ఈ చిత్రం టీజర్ విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్, ట్రిడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతా కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దెయ్యమా? ఒకటి కాదు.. రెండు దెయ్యాలు అంటూ కోవై సరళ వాయిస్ లో వినిపించే డైలాగ్ టీజర్ లో ఆకట్టుకుంటోంది. గృహిణి పాత్రలో తమన్నా లుక్స్, డబుల్ షేడ్స్ ఉన్న కేరక్టర్‌లో ప్రభుదేవా మెప్పిస్తున్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ అలరించే సినిమా అవుతుంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే, మనసుకు నచ్చే ఆహ్లాదకరమైన సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతా పెర్ఫార్మెన్స్ లు హైలైట్ అవుతాయి. శామ్ సంగీతం అందరినీ తప్పక అలరిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మే 1న చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇప్పటికే టీజర్ చూసిన వాళ్లందరూ చాలా బావుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పారు.