మీడియా విస్తృతంగా వ్యాపించింది. కానీ అసలు మీడియాకి చెందని వారు కూడా సోషల్‌మీడియా పుణ్యమా అని జర్నలిస్ట్‌లుగా చెలామణి అవుతున్నారు. బతికున్న వారిని కూడా తమ వార్తలతో చంపేస్తున్నారు. ఇది మీడియా రెండోకోణం. దీనిపై కమెడియన్ సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆయన మాట్లాడుతూ, ‘సునీల్ చనిపోయాడని వార్తలు రాశారు. దానికి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. తమ మీడియా పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతారా? ఇదెక్కడి న్యాయం? సోషల్‌మీడియా ట్రెండ్‌లో ఎన్నో అపార్థాలు, అనర్థాలు జరుగుతున్నాయి. మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. అలా రాసిన వ్యక్తిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పయిపోయింది. వదిలేయండి. ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుంది. నేను మీ అభిమానిని. అలా రాసినందుకు క్షమించండి అని అతను వేడుకున్నాడు. ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతడిని క్షమించి వదిలేశాను. మేము నిన్ను హర్ట్ చేస్తాం. మీరు మాత్రం మాకు వినోదాన్ని పంచాలి అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు తయారైపోయాయి. టైమ్స్ వంటి పత్రికలు కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నాయి. ప్రతిది నిజనిర్ధారణ చేసుకున్నాకే రాయాలి. సోషల్‌మీడియా యుగంలో విలువలు పతనమైపోయాయి.
ఇంతకు ముందు మీడియా ఇలా ఉండేది కాదు. నా కెరీర్ ప్రారంభంలో కొన్ని పరిమిత మీడియాలు ఉండేవి. ప్రతి వారు ఇంటర్వ్యూలు చేసుకుని వెళ్లేవారు. ప్రతి ఒక్కరికి అవసరం అనుకుంటే విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారం. కానీ ఇప్పుడు ఇవ్వన్నీ సింగిల్ టేక్‌లో అయిపోతున్నాయి.. అని ఆవేదన వెలిబుచ్చాడు. ఇక తనకు చిత్రలహరి చిత్రంతో మంచి పేరు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు.