కమెడియన్‌గా టాప్‌రేంజ్‌లో బ్రహ్మానందం వంటి వారికి పోటీ ఇస్తూ సాగిన సునీల్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. తనకు సూట్ అయ్యే ‘అందాలరాముడు, మర్యాదరామన్న, పూలరంగడు’ వంటి చిత్రాలతో హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన తనకు సరిపోయే కథలను కాకుండా మాస్ ఇమేజ్ కోసం అని తెగ ప్రయత్నాలు చేసి చివరకి రెండింటికి చెడ్డ రేవడి అయ్యాడు. కానీ ప్రస్తుతం మరలా తన పాత దారిలోకి వచ్చి కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. ఆయనకు తాజాగా వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంలోని పాత్ర మరీ అద్భుతంగా లేకపోయినా ఫర్వాలేదు అనే రీతిలో ఉంది. ఈసందర్భంగా సునీల్ పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ, ‘భీమవరంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకంటే ఓ ఏడాది సీనియర్. సినిమాలపై మోజుతో నేను మొదట హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌ని కూడా తీసుకుని వచ్చాను. నా బాధలను పంచుకునే ‘గ్లాస్‌మేట్’ త్రివిక్రమే. త్రివిక్రమ్‌ని నాకోసమే హైదరాబాద్ తీసుకుని వచ్చాను. ఎలాంటి విషయాన్నైనా పంచుకోగలిగిన మిత్రుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్‌తో కాసేపు మాట్లాడితే చాలు ఉత్తేజం వస్తుంది. ఎవరు ఎంతటి బాధల్లో ఉన్నా వారిని మామూలు మనుషులను చేయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాసే. నేను హీరోగా చేసిన సమయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటాననే అపవాదు ఉంది.
నా సినిమాలలో ప్రముఖ రైటర్లు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఓ మోస్తరు రైటర్లను పెట్టుకుని వారికి నేనే పారితోషికం ఇచ్చి రాయించుకునే వాడిని. అలా నా వల్ల హిట్స్ సాధించి, తర్వాత నేను అతిగా జోక్యం చేసుకుంటానని దుష్ప్రచారం చేసిన రచయితలు ఉన్నారు. అయితే నాపై అనవసర ఆరోపణలు చేసిన వారు మరలా హిట్స్ కొట్టలేదు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటే పొగిడేవారు ఉంటారు. పడిపోతే మరింత బాధకు గురిచేసేవారే ఎక్కువగా ఉంటారని సునీల్ చెప్పుకొచ్చాడు.