ఒకానొక దశలో ఆమె పూర్తిగా ఫేడవుట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పెళ్లి పీటల వరకు వచ్చిన తతంగం చివరి నిమిషంలో రద్దయింది. అదేమి చిత్రమో ఆ తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపులోకి వచ్చింది. ఆమె చిరకాల కోరిక అయిన రజనీకాంత్‌తో నటించే అవకాశం కూడా సాధించింది. ఇటీవలే ఆమె విజయ్‌సేతుపతితో కలిసి ‘96’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విజయ్‌సేతుపతికి ధీటుగా త్రిష నటించి మెప్పించింది. ఈ చిత్రానికి గాను ఆమెకి అవార్డులు, రివార్డులు రెండు దక్కాయి. దాంతో ఇక ఆమె చేతిలోకి ఏకంగా అరడజను చిత్రాలు వచ్చి చేరాయి.
ఆమె ఎంత బిజీగా మారిందంటే మరో రెండేళ్ల వరకు ఆమె కాల్షీట్స్ లేనంత బిజీ అయింది. ‘గర్జన్నై, పరమపథమ్‌విళయాట్టు, శతురంగ వెట్టై 2’ వంటి పలు చిత్రాలలో నటించింది. అయితే ఈమెకి ఊహించని అవకాశం వచ్చి తలుపు తట్టింది. దేశం గర్వించదగ్గ దర్శకుడు మురుగదాస్ చిత్రంలో ఆమెకి స్థానం లభించింది. ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు ‘జర్నీ’ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించనున్నాడు. మురుగదాస్ స్వయంగా స్క్రిప్ట్‌ని అందిస్తూ ఉండటం విశేషం. ఇలా మురుగదాస్ స్వయంగా తానే నిర్మిస్తూ, స్క్రిప్ట్‌ని అందిస్తూ కర్త, కర్మ, క్రియ తానే అయి తన శిష్యుడి దర్శకత్వంలో తీస్తున్నఈ చిత్రం హిట్ అయితే మరో మూడు నాలుగేళ్లు త్రిష కెరీర్‌కి ఢోకా ఉండదనే చెప్పాలి.
ఇకత్రిష జోరుని చూసి తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల నుంచి కూడా ఆమెకి విపరీతమైన అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఒకవైపు రజనీతో ‘దర్బార్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ‘దర్బార్’ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది.