ఏదిఏమైనా ప్రేమకథలు, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ స్టోరీలు సక్సెస్‌మంత్రాగా పనిచేస్తూ ఉంటాయి. ‘మాతృదేవోభవ:, నాన్నకు ప్రేమతో, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి ఎన్నో చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఇక విషయానికి వస్తే సీక్వెల్స్‌లో రెండు తరహాలు ఉన్నాయి. మొదటి పార్ట్ విజయవంతం అయితే అదే టైటిల్‌కి సీక్వెల్‌గా పేరును పెట్టి, స్టోరీ మాత్రం మొదటి పార్ట్‌తో ఏ సంబంధం లేకుండా కేవలం టైటిల్‌ని కొనసాగింపు చేయడం ఒక పద్దతి. దీనికి ఉదాహరణ ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలు. రెండో కోవలోకి వచ్చే చిత్రాలు ఏమిటంటే కథను కొనసాగింపుగా, అదే తరహాగా తీసినా టైటిల్‌ని మాత్రం వేరే పెడతారు.
ఇప్పుడు అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు రెండో ఫార్ములానే ఫాలో అవుతున్నారని అర్దమవుతోంది. మరో పది పదకొండు రోజుల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా ‘జులాయి, సన్నాఫ్‌సత్యమూర్తి’ల తర్వాత ఓ హ్యాట్రిక్ మూవీ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘నేను-నాన్న ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని సమాచారం. నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని అల్లుఅర్జున్ చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం పూర్తయి విడుదల కావడానికి మరో ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో మొత్తానికి బన్నీ ఒకటిన్నర ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక అజ్ఞాతవాసి చిత్రంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అరవింద సమేత వీరరాఘవ ద్వారా మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఇక త్రివిక్రమ్, బన్నీల చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం కూడా సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో ఫాదర్ సెంటిమెంట్‌ని, మాస్ కమర్షియల్ అంశాలను జోడించి తీయనున్నారని తెలుస్తోంది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో తండ్రి పాత్ర పోషించిన ప్రకాష్‌రాజ్ పాత్ర కేవలం కొన్ని సీన్లకే పరిమితం అవుతుంది. అయితే సినిమా మొత్తం ఆయన పాత్ర ఇంపార్టెన్స్ అంతర్లీనంగా సాగుతుంది.
ఇక తాజా చిత్రంలో బన్నీకి తండ్రిగా జయరాం నటిస్తుండగా, ఆయన పాత్రకి జోడీగా ఎంతో కాలం తర్వాత మరలా నగుమోము నగ్మా స్ట్రెయిట్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో జయరాం పాత్ర సినిమా మొత్తం ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి ఆల్‌రెడీ ట్యూన్స్ అందించడంలో సంగీత దర్శకుడు థమన్ బిజీబిజీగా ఉన్నాడని తెలుస్తోంది.