నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే బంగార్రాజు సినిమా విశేషాలు ఇప్పుడు తరుచు వార్తల్లో ఉంటున్నాయి. అసలు బంగార్రాజు ప్రాజెక్ట్ అటకెక్కినది అనుకున్నవారికి.... నాగార్జున చిన్నపాటి షాకిస్తూ సినిమా త్వరలోనే మొదలవ్వబోతుందని చెప్పి ఝలక్ ఇచ్చాడు. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడని.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా.. ఇప్పుడు నటీనటుల ఎంపికపై కళ్యాణ్ కృష్ణ దృష్టి పెట్టాడట. ఇక నాగార్జున సరసన హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలెట్టిన కల్యాణ్ కృష్ణ. నాగ్ కోసం నయనతార ని తేవాలని ఆమెని సంప్రదించగా.. నయనతార ప్రస్తుతం రజినీకాంత్ - మురుగదాస్ ప్రాజెక్ట్ తోపాటుగా మరికొన్ని సినిమాలు చేతిలో ఉండడంతో.. డేట్స్ ఖాళీ లేవని చెప్పి పంపించిందట.
అయితే నాగ్ సరసన నయన్ కాకపోతే.. నాగ్ లక్కీ హీరోయిన్ అనుష్క ని తీసుకుంటే ఎలా ఉంటుందో అని కళ్యాణ్ కృష్ణ ఆలోచిస్తే.. సోగ్గాడే చిన్నినాయనలో గెస్ట్ రోల్ చేసింది కాబట్టి.. అనుష్క ని వద్దులే అనుకుని.. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక పేరు పరిశీలిస్తున్నారట. మరి సూర్య తో పెళ్లి తర్వాత జ్యోతిక కొన్నాళ్లు సినిమాలకు గ్యాపిచ్చి... మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరీ క్రేజ్ ఉన్న సినిమాలు చెయ్యకపోయినా.. జ్యోతిక పెళ్లి తర్వాత కూడా మంచి సినిమాలే చేస్తుంది. అయితే ప్రస్తుతం బంగార్రాజు లో ఏజ్ పాత్ర చేస్తున్న నాగ్ సరసన జ్యోతిక అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ఎలాగూ మాస్ సినిమాలో నాగ్ - జ్యోతిక కలిసే నటించారు కూడా. ఇక ఈ బంగార్రాజు సినిమాలో అక్కినేని అఖిల్ ఓ గెస్ట్ రోల్ ప్లే చెయ్యబోతున్నాడు.