‘జెర్సీ’ ... మోస్ట్ బ్యూటీఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ - నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఏప్రిల్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 12న ఉదయం 9 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. అదే వారంలో 15 న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం. ఏప్రిల్ 19న అనుకున్నట్టే సినిమాను విడుదల చేస్తాం. నిన్నా మొన్నా కొందరు నాకు ఫోన్ చేసి, ‘ఏంటి రిలీజ్ లేదంటగదా’ అని అడిగారు. అదేం లేదు. ముందే చెప్పినట్టు 19న కచ్చితంగా సినిమాను విడుదల చేస్తాం. షూటింగ్ పూర్తయింది. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. శాటిస్‌ఫైడ్‌గా ఉంది. తెలుగు సినిమాలో కొత్త జోనర్‌ని ఓపెన్ చేస్తున్నామనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అని అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నుంచి వచ్చే 10 రోజులు మనం అందరం కలుసుకుంటాం. ఈ రోజు నుంచి జెర్సీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేస్తున్నాం. మా ఫైనల్ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరూ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంటే అక్కడున్నాం. ఇప్పుడు అందరం ఫ్రీ అయిపోయాం. ఇక ఫుల్ స్వింగ్‌లో పబ్లిసిటీ చేస్తాం. ఇక రెగ్యులర్‌గా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం. జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 12న, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ఉంటుంది. మోస్ట్ బ్యూటీఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదల కానుంది.
నేను సినిమా కోసం తగ్గలేదు. సినిమా చేయడం వల్ల తగ్గాను. క్రికెట్ ఆడి, దానికి ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకే తెలియకుండా తగ్గాను. 36 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా నటిస్తుండటం వల్ల కాస్త లావవుదామని అనుకున్నా. కానీ నాకే తెలియకుండా తగ్గాను. నన్ను నేను మర్చిపోయి ఇటీవల ఈ సినిమా చూశా. 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్రతి ఒక్కరూ నానిని మర్చిపోయి, కేవలం అర్జున్‌ని మాత్రమే చూస్తారు. ఆర్టిస్టుగా నాకు ఎక్స్ ట్రీమ్ శాటిస్‌ఫేక్షన్ వచ్చింది. అందరూ ఈ సినిమాకు క్రికెట్ ప్రధానమని అనుకుంటున్నారు. కానీ అంతకు మించిన సర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోషనల్ సినిమా. నేను ఇంతకు ముందు ఏ సినిమా చేసినా సరే... ‘ఇదే ఆఖరి రోజు’ అనే ఫీలింగ్ ఉండేది తప్పితే, ‘అరే.. ఈ రోజు ఇది ఆఖరి రోజా...’ అని పెద్దగా ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవరో నాతో పాటు కలిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కి సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బరువుగా ఇంటికి వెళ్లింది ‘జెర్సీ’ సినిమాకే. ఏ స్పోర్ట్స్ లో అయినా, స్పోర్ట్స్ మేన్ వేసుకునే టీ షర్ట్ ని జెర్సీ అని అంటారు.
కేవలం క్రికెట్ మీద సినిమా కాబట్టి జెర్సీ అనే టైటిల్ పెట్టాం అని అనుకోవద్దు. జెర్సీ అనే కాన్సెప్ట్ మీద చాలా ఎమోషన్ ఉంటుంది. అదేంటన్నది 19న తెలుస్తుంది. నేను, మా నిర్మాత వంశీ ఇద్దరం క్లాస్‌మేట్స్. క్రికెట్ మెయిన్ టీమ్‌లో తను ఉండేవాడు, నేను ఎక్స్ ట్రా ప్లేయర్స్ లో ఉండేవాడిని. వంశీ కెరీర్లోనూ ఇది మంచి సినిమా అవుతుంది. ‘వీడు మా డైరక్టర్’ అని చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక దర్శకుడు దొరికాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదు. గౌతమ్ గురించి చెప్పాలనిపించింది. గౌతమ్ తొలిసారి వచ్చి కథ చెప్పినప్పుడు, ఇందులో క్రికెట్ అనేది నీడ మాత్రమే, కానీ ఎమోషన్ గొప్పగా ఉంటుంది అని అర్థమైంది. సినిమా చూసే ప్రతి ఒక్కరూ నానిని క్రికెట్ పర్సన్‌గానే చూస్తారు. ఇంతకు ముందు క్రికెట్ ఆడేవాళ్లను చూస్తే ‘ఏంది వీళ్లు.. బాల్ కొట్టలేకపోతున్నారు’ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ల కష్టం అర్థమవుతోంది.
నేను స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. సినిమా మీద ఆసక్తి పెరిగిన తర్వాత నేను క్రికెట్ ఆడటం మానేశా. సచిన్ రిటైర్ అయిన తర్వాత అసలు క్రికెట్ చూడటమే మానేశా. ఇప్పుడు ఐపీయల్ వంటివాటిని అసలు చూడటం కూడా లేదు. నాకు సినిమానే ప్రపంచం. కానీ ఈ సినిమా కోసం ఆడటం మొదలుపెట్టిన తర్వాత, గేమ్ ఇంకాస్త అర్థమైన తర్వాత క్రికెట్ అంటే కూడా ఇష్టం మొదలైంది. నా కెరీర్‌లో క్విక్‌గా... విన్న వెంటనే ఓకే చేసి, వెంటనే సెట్స్ మీదకు వెళ్లి, అనుకున్న ప్రకారం విడుదలకు వచ్చిన సినిమా ఇది. అప్పట్లో 146 డేస్ టు గో అని ఒక పోస్టర్‌ని విడుదల చేశాం. దాని ప్రకారం విడుదల చేయగలమా అని మధ్యలో అనుమానాలు వచ్చాయి. కానీ విధి మమ్మల్ని అనుకున్న తేదికే మీ ముందుకు తీసుకొచ్చి నిలిపింది. ఈ సినిమాలో నేను సచిన్ కొడుకును కాదు. సినిమా అంతా మేజర్‌గా రంజీ మ్యాచస్ మీద ఆధారపడి ఉంటుంది. డాన్యుల్ క్రికెట్ అకాడమీలో నేను ప్రాక్టీస్ చేశా. మా ఆఫీస్ దగ్గర కాబట్టి, కంఫర్టబుల్‌గా నేర్చుకున్నా. షూటింగ్‌లో ఒకసారి ముక్కు కూడా పగిలి పక్కకు వెళ్లింది. క్రికెట్ పరంగా ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో, అంత డీటైలింగ్‌గా తెలుగులో వచ్చిన తొలి సినిమా ‘జెర్సీ’ అవుతుంది.
సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా సినిమా కోసం ఆడినట్టు ఉండదు. ఈ సినిమా పరంగా నాకు ప్రతిదీ కొత్తే. నాకు ఇందులో క్రికెటర్ అర్జున్ కథ చెప్పడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. అర్జున్ అనే వాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్షనల్ స్టోరీయా అనే డౌట్ అందరికీ వస్తుంది. ఒకరి కథ చూసి మనం స్ఫూర్తి పొందడం అనేది ఉంటుంది చూశారా.. అది అర్జున్‌ని చూసినప్పుడు అనిపిస్తుంది. సినిమా చూసినప్పుడు మాత్రం అర్జున్ కథ నిజమనిపిస్తుంది. హైదరాబాద్ ప్లేయర్‌గా అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నట్టు చూపిస్తాం. 86, 96, 2018 సంవత్సరాలను చూపించాం సినిమాలో.
సాను, గౌతమ్ చేసిన గ్రౌండ్ వర్క్, స్టోరీ బోర్డ్ వంటివి ఆసమ్. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ఇలాంటి సినిమాను షూట్ చేయడం చాలా కష్టం. అంత ఆథంటిక్ సినిమాను తీయడానికి ప్రధాన కారణం సాను, గౌతమ్. వాళ్ల కష్టం చూస్తే మనం ఇంకా కష్టపడాలనిపిస్తుంది. వీఎఫ్ ఎక్స్ చాలా బాగా వచ్చాయి. జ్యూక్ బాక్స్ లో ఐదు పాటలుంటాయి. ఒక సర్ ప్రైజ్ సాంగ్‌ని సినిమాకు ముందు విడుదల చేస్తాం. అనిరుద్ సంగీతం చాలా ఇష్టం నాకు. అతనితో వెంట వెంటనే రెండు సినిమాలకు పనిచేయడం ఆనందంగా ఉంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్రతి రోజూ రాత్రి 6.30కి మొదలైతే ఉదయం వరకు చేసేవాళ్లం. హైదరాబాద్‌లో ఇటీవల విపరీతమైన చలి అనిపించింది కదా... అప్పుడు షూట్ చేశాం. సినిమాను ప్రస్తుతం తెలుగులో విడుదల చేస్తున్నాం.’’ అని అన్నారు.