శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది పురస్కారాల వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా సినీ అవార్డుల కేటగిరిలో ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ( మహానటి ) ఉత్తమ దర్శకుడు సుకుమార్ ( రంగస్థలం ), జ్యురి ప్రత్యేక అవార్డు రాశిఖన్నా (తొలిప్రేమ ), ఉత్తమ చిత్రం: మహానటి, ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ ( గీత గోవిందం ), ఉత్తమ నటి : సమంత ( రంగస్థలం ), ఉత్తమ నూతన నటి : రష్మిక మందన్న ( గీత గోవిందం), ఉత్తమ నూతన నిర్మాత : సాహు గారపాటి ( కృష్ణార్జున యుద్ధం), ఉత్తమ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి ( తొలిప్రేమ ), ఉత్తమ హాస్యనటి : విద్యుల్లేఖ రామన్ ( తొలిప్రేమ ), ఉత్తమ నేపధ్య గాయని : చిన్మయి శ్రీపాద ( గీత గోవిందం )లు ఈ అవార్డులు అందుకున్నారు.
వీటితో పాటు బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటీమణి సుహాసిని, బాపురమణ పురస్కారం సినీ ఆర్టిస్ట్ సురేష్ కడలిలకు అందజేశారు. ఈ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారం అవార్డును వైద్య మరియు సేవ రంగంలో మంచి పేరు సంపాదించుకున్న శ్రీమతి కపిల దళవాయి, తెలుగు పరిశోధన అధికారి ఆవుల మంజులతలకు అందచేశారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ కళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవార్డుల వేడుకను బేతిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా శ్రీ సురేష్ చుక్కపల్లి, శ్రీమతి కరుణ గోపాల్, ప్రముఖ గాయని పి సుశీల, ఎన్ టి చౌదరి, ఎన్వీ ప్రసాద్, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న సందర్బంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ. నాకు అవార్డుల వేడుకకు చాలా మంది పిలిచారు.. కానీ స్టేజి మీదకు వెళ్లాలంటే చాలా సిగ్గు. అందుకే ఏ అవార్డులకు అటెండ్ కాను, ఆర్య సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాను.. ఆ తరువాత చాల రోజులకు కళాసుధ అవార్డుని అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. చెన్నైలో తెలుగు వాళ్ళమధ్య ఈ కార్యక్రమం ఇంతబాగా జరగడం ఆనందంగా ఉంది. తొలిప్రేమ చిత్రానికి నాకు ఈ అవార్డు ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అన్నారు.
ఈ సందర్బంగా కళాసుధ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లో మంచి పేరు సంపాదించుకున్న వారికి అవార్డులు ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అలాగే మా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు.