రాజకీయాలలో పొత్తులు ఉండవచ్చు. కానీ రహస్య అవగాహనలు మాత్రం పెట్టుకుని అవి ప్రజలకు తెలియవని అనుకోవడం తెలివి తక్కువే అవుతుంది. ఇక విషయానికి వస్తే కిందటి ఎన్నికల్లో చంద్రబాబు బిజెపి, జనసేన మద్దతు తీసుకున్నాడు. ఎలాగోలా గెలిచాడు. కానీ ఆయన ఎన్డీఏలో కొనసాగినంత కాలం వైసీపీ నేత జగన్ అవసరం బిజెపికి రాలేదు. చంద్రబాబు, బిజెపిల మధ్య దూరం వచ్చిన తరుణంలోనే జగన్ బిజెపికి సన్నిహితం అయ్యాడని చెప్పవచ్చు. ఇక పార్టీ ఏదైనా కానీ ఏపీకి మోదీ చేసిన అన్యాయం మాత్రం సుస్పష్టం. ఇందులో ఎవ్వరికీ భేదాభిప్రాయాలు లేవు. చంద్రబాబు నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత అయినా తెగతెంపులు చేసుకున్నాడు. మోదీపై ఫైర్ అవుతున్నాడు.
కానీ ఇప్పటికీ జగన్ మాత్రం బిజెపిని, మోదీని పల్లెత్తు మాట అనడం లేదు. వైసీపీకి మూలస్థంభాలైన ఓటు బ్యాంకుగా క్రిస్టియన్లు, దళితులు, ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఎన్నికల్లో విడిగా పోటీ చేసి అవసరమైతే ఎన్నికల తర్వాత పోయిన సారి బాబు ఎన్డీయేకి అభయం ఇచ్చినట్లు ఈసారి జగన్ మోదీకి అభయం ఇవ్వడం ఖాయమని స్పష్టంగా అర్ధమవుతోంది. బారసాల నాడే ఆవకాయని ఎవ్వడు తినడు. అలాగే మోదీకి దగ్గరైన వెంటనే జగన్ తన కేసులు మాఫీ చేసుకోడు. ఎన్నికలు జరిగిన తర్వాత మరలా మోదీ అధికారంలోకి వస్తే మాత్రం జగన్ మొదట చేయబోయేది తనపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేసుకోవడమే. ఇక టిఆర్‌ఎస్‌తో కూడా జగన్ బహిరంగంగానే దోస్తీ చేస్తున్నాడు.
దీనిపై షర్మిలా మాట్లాడుతూ, బిజెపితో మాకు పొత్తు ఉంటే జగన్ ఇప్పటికే కేసులన్నీ మాఫీ చేయించుకునేవాడు కదా...! బిజెపితో వైసీపీకి పొత్తు ఉందనేది అబద్దం. ఇక టీఆర్‌ఎస్‌తో కూడా పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే. హరికృష్ణ భౌతిక కాయం వద్దే ఆయన ఆ పని చేశాడు. పొత్తుల కోసం వెంపర్లాడేది చంద్రబాబే. కానీ జగన్ నాడు కాంగ్రెస్ నుంచి సింగిల్‌గా వచ్చాడు. వైసీపీని సింగిల్‌గానే స్థాపించాడు అని చెప్పుకొచ్చింది. చంద్రబాబు దొంగ అనేది ఎంత నిజమో జగన్ అంత కంటే గజదొంగ అనేది కూడా నిజమే. ఈ విషయం షర్మిలాకి తెలియంది కాదు. నాగబాబు చెప్పినట్లు పెద్ద దొంగ కంటే చిన్న దొంగ మేలు అనేది వాస్తవం.