ఈమధ్యకాలంలో వారసుల ఎంట్రీ సమయంలో ఏ హీరోకి రాని క్రేజ్, ఇమేజ్ అక్కినేని వారి చిన్నబ్బాయ్ అక్కినేని అఖిల్‌కి వచ్చాయి. ఆయన హీరోగా తెరంగేట్రం చేయకముందే ఆయన వెనుక మల్టీనేషనల్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయి. అలా ఆయన నాలుగైదు యాడ్స్‌లో కూడా నటించాడు. ఇక మనం చిత్రంలో చిన్న కామియో రోల్‌లో కనిపించిన ఆయన అఖిల్ చిత్రం చేశాడు. సోలో హీరోగా తన మొదటి చిత్రమే వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా లోకాన్ని రక్షించే వీరుడి పాత్రను పోషించాడు. కానీ ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత ఆయన తన తండ్రి నాగార్జున ఇష్ట ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లోనే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హలో చిత్రం చేశాడు. ఇది కాస్త బెటర్ అనిపించినా ఇది కూడా కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ చేశాడు. ఇలా మొదటి మూడు చిత్రాలు ఆయనకు భారీ డిజాస్టర్స్‌నే మిగిల్చాయి. దాంతో ఆయన నటించబోయే నాలుగో చిత్రం ఎవరితో అనే ఆసక్తికర చర్య సాగుతోంది. అక్కినేని ఫ్యాన్స్ అఖిల్‌ని నెక్ట్స్ లెవల్‌లో చూడాలని భావిస్తున్నారు. మొదటి మూడు చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకు అందం, నటన, ఫైట్స్, డ్యాన్స్‌లతో మంచి గుర్తింపే వచ్చింది.
ఇటీవల క్రిష్ అఖిల్ కోసం ఓ పునర్జన్మల కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. వాటిని క్రిష్ ఖండించాడు. కానీ ప్రస్తుతం క్రిష్ అఖిల్ కోసం కూడా ఓ స్టోరీ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని వినిపిస్తోంది. ఇక అఖిల్ నాలుగో చిత్రం ‘మలుపు’ దర్శకుడు సత్యప్రభాస్ స్టోరీ వినిపించాడని, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రం కథ అఖిల్‌కి బాగా నచ్చిందని వార్తలు వస్తున్నాయి. కానీ అఖిల్ నాలుగో చిత్రం మాత్రం గీతాఆర్ట్స్ బేనర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ నాలుగేళ్ల కాలంలో అఖిల్‌కి సరైన హిట్ ఇచ్చే అవకాశం బొమ్మరిల్లు భాస్కర్ చిత్రానికి ఉందా? అసలు అఖిల్ నటించే తదుపరి చిత్రాలు ఏమిటి? అనే విషయాలు 8వ తేదీన అఖిల్ జన్మదినోత్సవం నాడు అఫీషియల్‌గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది....!