అందరివాడుగా సినీ రంగంలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి పెద్దగా రాణించలేకపోయారు. ఎవ్వరూ కనివిని ఎరుగని రీతిలో అతి తక్కువ సీట్లు సాధించి, ఇక పార్టీని నడపలేక సోనియాగాంధీ కాళ్ల కింద పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. తద్వారా తన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు, తాను కేంద్రమంత్రిగా స్థానం కొట్టేశాడు. కానీ గత 2014లో చిరంజీవి ఎంతో ప్రచారం చేసినా కూడా ఆయన మ్యాజిక్ పని చేయలేదు. ఒక్కచోట కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. దాంతో దాదాపు దశాబ్దం గ్యాప్ ఇచ్చి తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంగా ‘ఖైదీనెంబర్ 150’తో సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు. సినిమాలలో ‘అందరివాడు’గా పేరు తెచ్చుకున్న తాను రాజకీయాల వల్ల కొందరివాడుగా మారడం ఆయన వీరాభిమానులకు కూడా మింగుడు పడలేదు.
ఇక ఈ ఎన్నికల్లో కూడా చిరు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసే సూచనలు లేవు. మరోవైపు ఆయన సోదరుడు జనసేనాని పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇటీవలే పవన్ సోదరుడు నాగబాబు కూడా జనసేన తరపున నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం ఖరారైంది. చిరు అనుమతి లేనిదే నాగబాబు జనసేనలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక చిరు కర్ణాకటలోని మాండ్యా నియోజకవర్గం నుంచి తన సహనటి సుమలత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆమె తరపున ప్రచారం నిర్వహిస్తాడని వార్తలు వచ్చాయి. సుమలత భర్త అంబరీష్ కూడా చిరుకి ఎంతో ఆప్తుడు. దాంతో మాండ్యాలో మంచి ఫాలోయింగే ఉన్న చిరుని, సుమలత తనకి ప్రచారం చేయాలని కోరిందని వార్తలు వచ్చాయి. కానీ ఇది జరిగే పనిలా లేదు.
తాజాగా చిరు మరో నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తాడని తాజాగా వార్తలు వచ్చాయి. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నాడని అంటున్నారు. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించాడు. మరోవైపు చిరంజీవికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దగ్గరి బంధువు. తన కోడలు ఉపాసనకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వయాన చిన్నాన్న అవుతాడు. ఇక చిరు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ఆయన తన సోదరుడు నాగబాబు పోటీ చేస్తోన్న నరసాపురంలో కూడా ప్రచారం చేయాలనే డిమాండ్ ముందుకు వస్తుంది. మరి దీనికి చిరు సిద్దంగా ఉన్నారా? లేదా? అన్నది తేలాల్సివుంది...!