ఇటీవల విడుదలైన దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన చిత్రాలు సంగీతపరంగా బాగా నిరాశపరుస్తున్నాయి. చాలా చిత్రాలకు ఆయన అందించే ట్యూన్స్ వింటుంటే నిజానికి వీటిని కంపోజ్ చేసింది దేవిశ్రీయేనా అనే అనుమానం రాకమానదు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఆయన చేతిలో రెండు కీలకమైన చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. వీటిలో మొదటిది మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ ఒకటి కాగా.. రెండో చిత్రం మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రూపొందుతూ మే9న విడుదల కానున్న ‘మహర్షి’ చిత్రాలు.
ఇక తాజాగా మహేష్ ‘మహర్షి’ చిత్రంలోని ఓ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. పాట, ట్యూన్న్ ఎంతో బాగున్నా గానీ ఈ పాటను తానే స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ పాడటం అంతగా నచ్చలేదు. గతంలో ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన మహేష్ బాబు ‘నిజం’, రమణగోగుల, చక్రి వంటి వారు తామే సింగర్స్ కావాలని పట్టుబట్టి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక దేవిశ్రీ ‘మహర్షి’ చిత్రానికి సొంత గొంతుతో దేవిశ్రీ పాడటం వల్ల ఆయనపై ట్రోలింగ్ నడుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ‘చిత్రలహరి’లోని లిరికల్ సాంగ్ మాత్రం ఎంతో బాగుంది. ఈ సినిమా నుంచి విడుదలైన మూడో లిరికల్ సాంగ్ ఇదే కావడం గమనార్హం.
‘రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్తపువ్వులా... ఏడురంగులొక్కటై పరవశించే వేళలో, నేలకే జారిన కొత్త రంగులా.. ప్రేమ వెన్నెలా... రావే ఊర్మిళ’ అంటూ ఈ వీడియో లిరికల్ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శినిలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. దేవిశ్రీ సంగీతం, శ్రీమణి సాహిత్యం, సుదర్శన్ అశోక్ ఆలాపనలు యూత్‌ని కట్టిపడేసేలా ఉన్నాయి. తేలికైన పదాలతో శ్రీమణి అద్భుతమైన, అందమైన అర్ధవంతమైన సాహిత్యాన్ని అందించాడు. కాగా మైత్రి మూవీమేకర్స్ నిర్మాణంలో సాయిధరమ్‌తేజ్, కళ్యాణి ప్రియదర్శిని నటించిన ఈ చిత్రం 12 వ తేదీన విడుదల కానుంది. 6వ తేదీన ప్రిరిలీజ్ వేడుకను చేయనున్నారు.