అనుకున్నట్లుగానే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో తప్ప దేశవిదేశాలలో కూడా విడుదలైంది. మనకి తెలిసిన ఒక్క మొహం కానీ, స్టార్ క్యాస్టింగ్ కూడా లేకపోయినా ఈ చిత్రంలో ఎన్టీఆర్ వెన్నుపోటుని గురించి వివరంగా చెబుతానని వర్మచేసిన హంగామా బాగా ఫలితాన్నే ఇచ్చింది. నాగార్జునతో ‘ఆఫీసర్’ వంటి డిజాస్టర్ తర్వాత ఫాంలో లేని వర్మ చిత్రం మొదటిరోజు కోటి వసూలు చేయడం అంటే మాటలు కాదు. ఇక ఈ చిత్రం ఏపీలో విడుదల కాకుండా తెలంగాణలో రిలీజ్ కావడంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలోని ఏపీ ప్రజలు భారీగా తరలి వెళ్లి చిత్రాన్ని చూసి వస్తున్నారు. నిజంగా ఇది వర్మ స్టామినాకి అద్దం పడుతుంది.
ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఓవర్‌సీస్‌లో చూపిస్తున్న జోరు చూస్తే బాలయ్య చేసిన ‘మహానాయకుడు’ కంటే మొదటి రెండు రోజుల్లోనే వెయ్యి డాలర్లకు పైగా ఎక్కువ వసూలు చేయడం గమనార్హం. ఇక విషయానికి వస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రను చేసి మెప్పించి హావభావాలను అద్భుతంగా పండించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటి నుంచి నాకు నాటకాలు వేయడం అంటే ఇష్టం. ఒకసారి నేను వేసిన నాటకం చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతో అభినందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నాకు వేషం రావడానికి నాటకరంగమే కారణం. రామానాయుడు స్టూడియోలో లక్ష్మీపార్వతి గారి కోసం స్పెషల్ షో వేశారు. ఆ సమయంలో నేను ఆమె వెనుక లైన్‌లోని సీటులో కూర్చున్నాను.
ఎన్టీఆర్ గారి పాత్ర పోషించింది నేనే అని ఆమెకు చెబితే ఆమె ఆశ్చర్యపోయారు. నన్ను ఎంతగానో అభినందించారు. తెరపై కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు ఆమె అక్కడే ఏడ్చేశారు. అవి నిజం కాబట్టే ఆమె తన ప్రమేయం లేకుండా ఏడ్చింది. ఈ చిత్రంలోని సన్నివేశాలన్ని నిజమేనని లక్ష్మీపార్వతి ఏడుపును చూస్తేనే అర్థమవుతుంది... అని విజయ్‌కుమార్ తెలిపాడు.