గతంలో ఎన్నికల కంటే ఈసారి లేడీ స్టార్ క్యాంపెయినర్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. టిడిపి నుంచి లేడీ స్టార్ క్యాంపెయినర్స్ ఎవ్వరూ కనిపించడం లేదు. కానీ వైసీపీ నుంచి మాత్రం జగన్ తల్లి విజయమ్మ, షర్మిలా, టి కాంగ్రెస్ నుంచి విజయశాంతి వంటి వారు మాత్రం ఉన్నారు. తాజాగా జగన్ తల్లి , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ, నాబిడ్డ ఎవరి కాళ్ల మీద పడే వ్యక్తి కాదు. జగన్ వ్యక్తిత్వం అలాంటిది కానేకాదని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు పదేపదే జగన్ కేసీఆర్, మోదీల వద్ద ఊడిగం చేస్తున్నాడనే విమర్శలకు సమాధానంగానే ఈమె ఈ వ్యాఖ్యలు చేసిందని అర్ధమవుతోంది.
ఆమె ఇంకా మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్‌పై కక్ష్యకట్టి మరీ కేసులు పెట్టారు. వైయస్సార్ మరణించిన తర్వాత ఓదార్పు యాత్రకు వస్తానని జగన్ హామీ ఇచ్చాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. మా కుటుంబం బాధల్లో ఉన్న ప్రతిసారి అభిమానులే అండగా నిలిచారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎన్ని కుట్రలు చేసినా జగన్ నాడే భయపడలేదు. ఇప్పుడు అసలు భయపడడు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జగన్ తిండి మాని మరీ దీక్షలు చేశాడు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా అవసరం లేదు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటానని చెప్పాడు. జగన్ పోరాడబట్టే ఏపీకి ప్రత్యేకహోదా విషయం ఇంకా సజీవంగా ఉందని విజయమ్మ చెప్పుకొచ్చారు.
ఇక టి కాంగ్రెస్‌కి చెందిన మరో లేడీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మరోవైపు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రూపురేఖలే మార్చలేకపోయిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో 16ఎంపీ సీట్లు గెలిస్తే దేశం రూపురేఖలే మారుస్తానని చెప్పడం హాస్యాస్పదం. మోదీ మనిషి కేసీఆర్. ఆ కేసీఆర్‌తో జగన్ తప్ప ఇంకెవ్వరు లేరు. కాబట్టి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దపు మాటలే. ఐదేళ్ల బిజెపి పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏ విధంగా చూసుకున్నా మోదీని ప్రజలు ఆదరించరు. ఈసారి దేశంలో ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. మొత్తానికి ఎలక్షన్ల వేడిలో ఈ లేడీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం జోరు మీద ఉందనే చెప్పాలి.