విశాఖపట్టణంలో చంద్రబాబు, మమతా బెనర్జీలతో పాటు డిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ అమిత్‌షాతో కలిసి దేశానికి ఎంతో నష్టం చేశారు. ఎన్నో సమస్యలు సృష్టించారు. చంద్రబాబు ఏపీకి మరోసారి సీఎం కావాలి. ఈ ఎన్నికలు దేశానికే కాదు.. ఏపీకి కూడా ఎంతో కీలకమైన ఎన్నికలు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మావంతు ఖచ్చితంగా ఏపీకి మద్దతు ఇస్తాం. మరలా మోదీ వస్తే అమిత్‌షాతో కలిసి దేశాన్ని నాశనం చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారు. ప్రశాంతంగా ఉండే దేశంలో మత, కుల, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టారు. నోట్ల రద్దుతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెద్దనోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఇప్పుడు తెలుస్తోంది. మరలా మోదీ గెలిస్తే దేశంలో హిట్లర్ పాలన వస్తుందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విజయవాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశంలోని పేదలపై యుద్దం ప్రకటిస్తే, మేము పేదరికంపై యుద్దం ప్రకటించాం. కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) ద్వారా అందరినీ ఆదుకుంటాం. ఏపీతో సహా అన్ని రాష్ట్రాలలోని పేదలకు ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుంది. ఈ దేశం ఎవరో ఒకరి సొత్తు కాదు. నాకు ఏపీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
ఇక జగన్‌పై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి. ఆయనకు అధికారం అప్పగిస్తే ఏమాత్రం అభివృద్ది జరగదు. ఒకవేళ అధికారం అప్పగించినా పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఈ సందర్భంగా రాహుల్ మరోసారి హామీ ఇచ్చారు.