పాదయాత్రకి, దైవ యాత్రకు మధ్య ఉన్న తేడా ఏమిటి? అంటే దైవయాత్ర అంటే దేవుడిని టార్చర్ పెట్టడం, పాదయాత్ర అంటే జనాలను టార్చర్ పెట్టడం అని ఆమధ్య నాగబాబు సెటైరిక్‌గా చెప్పాడు. ఇక నేడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పాదయాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జరిపిన పాదయాత్ర సంచలనం సృష్టించింది. అది ఆయన విజయానికి బాటలు వేసిందనే చెప్పాలి. దాంతో ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశాడు. ఇక రాబోయే ఎన్నికలలో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైన జగన్ అసెంబ్లీని ఎగ్గొట్టి కోర్టుకు హాజరవుతూ మరీ తన పాదయాత్రను పూర్తి చేశాడు.
తాజాగా సినీ దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి జగన్ పాదయాత్ర గురించి గొప్పగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తోన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఓటర్లందరు అండగా నిలవాలి. జగన్ గురించి చెప్పాలనిపించే నేను మీడియా ముందుకు వచ్చాను. ఆయన గురించి చెప్పకుండా ఉంటే తప్పు చేసిన వాడిగా మిగిలిపోతాను అనే భావన నాకు కలిగింది.
ప్రతి చిన్న విషయం మీద ఆయనకు సరైన అవగాహన ఉంది. విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం తదితర అంశాల గురించే ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉంది. జగన్ చేస్తున్న ప్రతి పని నా మనసులో నాటుకుంది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఎలా ఆలోచించేవారో.. జగన్‌మోహన్‌రెడ్డి కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ప్రజల మేలు కోరే ఇలాంటి నాయకులు అధికారంలోకి వచ్చి మంచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... అంటూ ఎస్వీకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. మరి పాపం ఆయన పార్ట్‌నర్ అచ్చిరెడ్డి ఇంకా జగన్ గురించి స్పందించలేదేమిటి చెప్మా...!