‘లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం’ గొడవలో పడి మన వారు పట్టించుకోలేదు గానీ తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం టైటిల్‌కి తగ్గట్లుగానే అమోఘంగా ఉందని అంటున్నారు. ఇటీవల తెలుగులో డబ్బింగ్ చిత్రాలు పెద్దగా ఆడటం లేదు. ‘విశ్వాసం, అంజలి సిబిఐ, ఐరా’ వంటి చిత్రాల పుణ్యమా అని డబ్బింగ్ చిత్రాలు విడుదలైతే కనీసం థియేటర్ రెంట్ చార్జీలు కూడా వస్తాయా? లేదా? అని మనవారు అతి జాగ్రత్తకు పోతున్నారు. మనది ఏది చేసినా అతే. ఒకటి ఆడితే చాలు పోలోమని వరుసగా విడుదల చేస్తారు. రెండు మూడు షాక్‌లు తగిలితే అసలిది కూడా వదిలేస్తారు.
నిజానికి ‘సూపర్ డీలక్స్’లో మన దగ్గర ఎంతో ఫాలోయింగ్ ఉన్న సమంత, రమ్యకృష్ణలు కూడా నటించారు. కానీ ఈ చిత్రం తెలుగులోకి డబ్ కాలేదు. తమిళ వెర్షన్ మాత్రమే హైదరాబాద్‌లో అక్కడక్కడషోలు పడుతున్నాయి. వాటికి కూడా టిక్కెట్స్ దొరకడం లేదు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న ‘వేంబు’ అనే పాత్రలో సమంత, మాజీ వేశ్యగా రమ్యకృష్ణ, కీలకమైన రోల్‌లో ఫర్హాద్ ఫాజిల్‌లు నటించారు. మూడు గంటల నిడివి ఉన్నా ప్రేక్షకులు ఏమాత్రం విసుగు చెందకుండా అద్భుతం అంటున్నారు. దీనినో క్లాసిక్‌గా అభివర్ణిస్తున్నారు.
ఈ చిత్రం దెబ్బకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ కూడా కుదేలయ్యింది. ఇక ఈ చిత్రం చూసిన అందరు విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ పాత్రలతో పాటు సమంత పాత్రపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని నెక్ట్స్ జనరేషన్ చిత్రంగా, ముఖ్యండా డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయని పెద్ద పెద్ద క్రిటిక్స్ కూడా కితాబు ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కన్నా డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ అంతలో డిజిటల్ ఫార్మాట్‌లోనో, లేక పైరసీగానీ వస్తే దీనిని డబ్ చేయడం కూడా అనవసరం అంటున్నారు. మొత్తానికి మన నిర్మాతలు అతి జాగ్రత్తకు పోయి ఓ మంచి చిత్రాన్ని వదిలేశారనే చెప్పాలి....!