‘వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నడం తెలివైన వారి లక్షణం’. ఇలా ‘వ్యూహం’ అనే పదానికి లోతైన అర్ధమే ఉంది. ఈ పేరు వింటేనే ఇది థ్రిల్లర్ తరహా సబ్జెక్ట్ అని, హీరో విలన్ల మద్య జరిగే మైండ్ గేమ్ అని అర్ధమవుతోంది. ఇక విషయానికి వస్తే నేచురల్ స్టార్‌ని నాని ప్రస్తుతం మధ్యవయస్కుడైన వ్యక్తి ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే ఆశయంతో చేసే విభిన్న ప్రయత్నంగా, స్పోర్ట్స్ డ్రామా ఇతి వృత్తంతో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్నాడు. శ్రద్దాశ్రీనాథ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ ‘యూటర్న్’, తమిళ ‘విక్రం వేదా’లతో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్దాశ్రీనాథ్‌తో పాటు ఇందులో క్రికెట్ కోచ్‌గా సత్యరాజ్ కీలకపాత్రను పోషిస్తుండగా, తమిళ నెంబర్ వన్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ విడుదలై ఆకట్టుకుంటోంది.
దీని తర్వాత చిత్రంగా నాని విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం చేస్తున్నాడు. దీనిని ఎలాగైనా దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీని తర్వాత నాని తనకు హీరోగా మొదటి బ్రేక్‌ని ‘అష్టాచెమ్మా’తో ఇచ్చి, మరోసారి ‘జెంటిల్‌మేన్’తో రెండో హిట్‌ని కూడా ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేయనున్నాడు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారని సమాచారం.
నానిది నెగటివ్ టచ్ ఉన్న పాత్ర కాగా మరో హీరోగా మలయాళ దుల్కర్ సల్మాన్‌ని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ‘సమ్మోహనం’తో ఇంద్రగంటి హిట్ ఇచ్చిన సుధీర్‌బాబుని ఎంచుకున్నారు. దిల్‌రాజుతో పాటు ఈ చిత్రాన్ని నాని కూడా భాగస్వామ్యం చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రం కోసం ‘వ్యూహం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం. టైటిల్‌పరంగానే మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.