డైరెక్టర్ సుకుమార్ తన కెరీర్‌లో అన్ని చిత్రాలు ప్రేక్షకులకు బాగా అర్ధమవుతాయని చెబుతూనే సామాన్య ప్రేక్షకుడికి అర్ధం కాని లెక్కలు, పజిల్స్ చూపిస్తూ ఉంటాడు. అలా కేవలం ‘ఎ’ క్లాస్ ఆడియన్స్‌ని మాత్రమే మెప్పించిన ఆయన ఎట్టకేలకు తాను చెప్పిన మాటకి కట్టుబడి పూర్తి కమర్షియల్ పంథాలోనే విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో అందరికీ అర్ధమయ్యే చిత్రంగా తీసిన మూవీ ‘రంగస్థలం’. రామ్‌చరణ్, సమంతలతో తీసిన ఈ చిత్రం అద్భుత ప్రేక్షకాధరణ పొంది 120కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చేసి నాన్-బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. దాంతో ఇక సుక్కు నుంచి ఇలా అందరినీ అలరించే చిత్రాలే వస్తాయని ప్రేక్షకులు ఆశించారు.
ఆయన తదుపరి చిత్రం మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో మహేష్‌బాబు 26వ చిత్రంగా రూపొందనుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ చిత్రం పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అదే సమయంలో మైత్రి మూవీస్ సంస్థ సుక్కుతో అల్లుఅర్జున్ చిత్రం ఉంటుందని ప్రకటించింది. ‘నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లుఅర్జున్ ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీతో ముందు కెళ్లాల్సివుంది. దాని తర్వాత సుక్కు-బన్నీల హ్యాట్రిక్ చిత్రం ఉంటుందని అందరు భావించారు. కానీ ఇంతలో సుక్కుకి దిల్‌రాజు, దర్శకుడు వేణుశ్రీరామ్‌ల నుంచి ముంపు పొంచి వచ్చింది.
సిద్దార్ద్ హీరోగా ‘ఓ మై ఫ్రెండ్’, నానితో ‘ఎంసీఏ’ చిత్రాలను తీసిన వేణుశ్రీరామ్ చెప్పిన స్టోరీ దిల్‌రాజుకి బాగా నచ్చడం, ఆయన వేణుశ్రీరామ్ చేత ఆ స్టోరిని బన్నీకి వినిపించడం జరిగాయట. ఈ స్టోరీలైన్ బన్నీని కూడా బాగా ఆకట్టుకోవడంతో త్రివిక్రమ్ మూవీ అనంతరం బన్నీ వేణుశ్రీరామ్, దిల్‌రాజులతోముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడని దాంతో ఆ చిత్రం పూర్తయ్యే వరకు సుక్కుని బన్నీ హోల్డ్‌లో ఉంచాడని సమాచారం.
ఇక ఇదే నిజమైతే దిల్‌రాజు బన్నీతో ‘డిజె’ తర్వాత చేయబోయే చిత్రం వేణుశ్రీరామ్‌దే అవుతుందని, కాబట్టి ప్రస్తుతానికి ఈ ఏడాది సుక్కు-బన్నీల చిత్రం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు సుక్కు తానే నిర్మాతగా రెండు చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా ‘రంగస్థలం’ ద్వారా తనను తాను మార్చుకున్న సుక్కుకి టైం సరిగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.