టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రలో ఊపిరి సలపని విధంగా సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కియా కంపెనీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కియా కంపెనీని ఏపీకి తెచ్చింది నేనే. కొరియాకు చెందిన ప్రపంచస్థాయికార్ల కంపెనీ కియాను గుజరాత్‌కి తీసుకెళ్లాలని మోదీ భావించాడు. కానీ కియా యాజమాన్యం మాత్రం మోదీని కాదని, నాపై నమ్మకం ఉంచి ఏపీకి వచ్చారు.
కియా సంస్థను అనంతపురం తీసుకెళ్లడానికి నేను ఎంతగానో ప్రయత్నాలు చేశాను. మోదీ కూడా కియాను గుజరాత్‌కి తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా రంగంలోకి దిగారు. కానీ కియా ప్రతినిధులు నన్ను నమ్మారు గానీ మోదీని నమ్మలేదు. అందుకే కియా ఏపీలోకి అడుగుపెట్టింది.. అని వ్యాఖ్యానించాడు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ కర్నూల్, అనంతపురం రోడ్‌షోలలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
కియాను ఏపీకి తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ కియా మోటార్స్‌ని ఏపీకి తెచ్చింది మోదీయే. ప్రధాని వల్లే కియా ఏపీకి వచ్చింది. అయితే కియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు భూకుంభకోణానికి తెరలేపారు. కియా మోటార్స్ రాకముందే రైతుల నుంచి భూములు లాక్కున్నారు. చంద్రబాబు హయాంలో ఒక పెట్టుబడి కూడా ఏపీకి రాలేదు. సీఎం ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేరలేదు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు... ఇలా అందరినీ చంద్రబాబు మోసం చేశాడు.
ఈ కాలంలో ఆరువేల స్కూల్స్ మూతపడ్డాయి. మేనిఫెస్టోలో కులానికో పేజీ పెట్టి అందరినీ వెన్నుపోటు పొడిచాడు. తాగునీరు ఇవ్వలేదు గానీ నదుల్లో ఇసుకను మాత్రం దోచేశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లితే చంద్రబాబు ఏం చేశారో? చెప్పాలని జగన్ చంద్రబాబుని నిలదీశాడు. ఇలా ఎన్నికలు సమీపించే కొద్ది చంద్రబాబు, జగన్, పవన్‌ల ప్రచారంతో ఎండకి మించిన ఎన్నికల వేడి ఏపీ అంతటా రాజుకుందనే చెప్పాలి.