భిన్నంగా చేయడం వల్ల పోయేదేమీ లేదు.. విలక్షణ నటుడు అనే గుర్తింపు వస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే కమల్‌హాసన్, విక్రమ్, సూర్య, అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లు ముందున్నారు. వీరు దాదాపుగా ఫేడవుట్ అయ్యే సమయంలో కోలీవుడ్‌లో మరో విలక్షణ నటునిగా విజయ్‌సేతుపతి దూసుకుని వచ్చాడు. మణిరత్నం ‘నవాబు’లో తుంటరి పోలీసుగా మార్కులు కొట్టేశాడు. ఇక త్రిషతో ఆయన చేసిన ‘96’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సీతకత్తి’తో భారతీయుడులోని సేనాపతిని పోలిన పాత్రలో ఇరగదీశాడు.
తాజాగా ఆయన నటించిన ‘సూపర్‌డీలక్స్’ చిత్రం విడుదలైంది. సాధారణంగా మన హీరోలు హిజ్రా పాత్రలను పోషించడానికి భయపడతారు. చిరంజీవి సైతం ‘చంటబ్బాయ్’లో ఓ సీన్‌లో అలా కనిపించేందుకు ఎంతో సంకోచించాడు. కానీ ఈ విషయంలో విజయ్ సేతుపతి తన స్టైల్ డిఫరెంట్ అని నిరూపించాడు. ‘సూపర్‌డీలక్స్’ చిత్రాన్ని, అందులోని విజయ్‌సేతుపతి చేసిన హిజ్రా పాత్రను మాస్టర్ పీస్ కింద విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సినిమా చూసిన వారంతా హిజ్రా పాత్రలో నటించిన విజయ్‌సేతుపతి గురించే చెప్పుకుంటూ ఉంటున్నారు. రివార్డులు, అవార్డులతో పాటు క్రిటిక్స్ ప్రశంసలను కూడా విజయ్ దక్కించుకుంటూ ఉండటం విశేషం.
ఇక ఈ చిత్రంలో నటించిన సమంత పాత్రకి కూడా మంచి రెప్సాన్స్ లభిస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్‌సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సై..రా..నరసింహారెడ్డి’లో కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. రాబోయే ఐదారేళ్లు విజయ్ డైరీ ఫుల్‌గా ఉంది. మరి రాబోయే చిత్రాలతో ఆయన మరెన్ని సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతాడో వేచిచూడాల్సివుంది.