సాధారణంగా చంద్రబాబు నాయుడు మొహంలో పెద్దగా నవ్వు కనిపించదు. ఎప్పుడు సీరియస్‌గానే కనిపిస్తూ ఉంటారు. ఆమధ్య ఓ రైతు ఆయన సభకి వచ్చి ఉదయాన్నే మందు తాగి వచ్చాను. అంతా మీ దయ అనడంతో చంద్రబాబు విరగబడి నవ్వాడు. ఇక తాజాగా చంద్రబాబు మరోసారి పవన్‌పై ఛలోక్తులు విసురుతూ జనాలను నవ్వించారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్‌షోలో బాబు తనలోని వ్యంగ్యాన్ని బాగా పండించాడు.
ఆయన మాట్లాడుతూ, నేను లక్ష రూపాయలు ఇచ్చి ఆడపడుచులను అత్తారిళ్లకు పంపుతున్నాను అని చెబుతూ, పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ విషయాన్ని ప్రస్తావించారు. నేను మాత్రం ఆడపడుచులను అత్తారిళ్లకి పంపుతూ ఉంటే పవన్ మాత్రం ‘అత్తారింటికి దారేది’ అంటూ తనదారిలో తాను పోతున్నాడు దారులు వెతుక్కుంటున్నాడు. చంద్రబాబు సైకిల్‌చైన్‌ని కేసీఆర్ తెంచేశారు.
ఇక సైకిల్ నడవడం లేదని పవన్ అంటున్నాడు. నా సైకిల్‌ని ముట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. నా సైకిల్‌ని తాకితే షాక్ తింటారు. నా సైకిల్‌ని తాకి నిలబడటం ఎవ్వరికీ సాధ్యం కాదు. సైకిల్ నుంచి కూడా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. నా సైకిల్ బుల్లెట్‌లా అంత స్పీడుగా వెళ్తుంది. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్. అలాంటి సైకిల్ చైన్‌ని ఎవరైనా తెంపగలరా? అలా తాకిన వారిని నేను వదిలిపెడతానా? అంటూ ఛలోక్తులు విసురుతూ రోడ్‌షోకి వచ్చిన వారిలో నవ్వులు పంచారు. మొత్తానికి అమావాస్యకి, పౌర్ణమికి మాత్రమే నవ్వు నవ్వే చంద్రబాబు రాజమండ్రిలో మాత్రం నవ్వుతూ, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కనిపించడం విశేషం.