సినిమా వారిలాగే రాజకీయ నాయకులకు కూడా పలు సెంటిమెంట్లు ఉంటాయి. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ తన కుటీరంలో తెల్లవారుఝామున యాగాలు, హోమాలతో పాటు పలు క్షుద్రపూజలు కూడా చేసేవాడని నాటి కొన్ని పత్రికలు రాసుకొని వచ్చేవి. ఇక కేసీఆర్ తాను అధికారంలోకి రావడానికి రాజశ్యామల యాగం చేయించాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయానికి వస్తే ఆయన అసలు ‘ఏడుకొండల వాడికి ఏడుకొండలు అవసరమా?’ అని తూలనాడాడు. జగన్ చెప్పులు వేసుకుని, పరమతస్థులు సమర్పించాలని లెటర్‌ని టిటిడికి సమర్పించకుండానే వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లడం పలు విమర్శలకు తావిచ్చింది. ఇక జగన్ వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు చేతిలో బైబిల్ పట్టుకుని తిరగుతూ ఉంటారు. కె.ఎ.పాల్‌ని మించిన స్థాయిలో తన అల్లుడు బ్రదర్ అనిల్‌ని ప్రమోట్ చేయడమే పాల్‌కి, వైఎస్‌కి మధ్య చిచ్చుపెట్టిందని అంటారు.
ఇక విషయానికి వస్తే జగన్ తాజాగా నెల్లూరు జిల్లాలో అతి రహస్యంగా రాజశ్యామల యాగం చేయించాడు. ఈనెల 27 నుంచి 29 వరకు ఈ యాగం జరిగిందనే సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. జగన్‌కి ఇవి డూ ఆర్ డై ఎన్నికలు. ఈసారి ఆయన ముఖ్యమంత్రి కాని పక్షంలో ఇక భవిష్యత్తులో ఆయన సీఎం అయ్యే చాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ కూడా మరో 20రోజుల్లో తానే సీఎంని అవుతానని చెబుతున్నాడు. ఈ ఎన్నికల్లో విజయం కోసమే ఆయన రాజశ్యామల యాగం చేయించాడని తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ యాగంలో ఈయన కుటుంబానికి సన్నిహితుడైన ఒకే ఒక్క మాజీ ఎంపీ మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. ఈ యాగంలో 27 మంది రిత్వికులు పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో ఈ యాగం జరిగింది. ఆయన సమక్షంలోనే పూర్ణాహుతి నిర్వహించారు. జగన్‌కి బదులుగా ప్రధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని పూర్తి చేశారు. కేసీఆర్ సలహాతోనే జగన్ ఈ రాజశ్యామల యాగం చేయించాడని లోకల్ మీడియాతో పాటు బెంగుళూరు మిర్రర్ పత్రిక కూడా తెలపడం విశేషం.