తెలుగులో రెండు హాస్యప్రధానమైన చిత్రాలుగా ‘టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల..మళ్లీ మొదలైంది’ చిత్రాలను తీసిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత ఆయనకు ఏకంగా కింగ్ నాగార్జున, అనుష్కలతో భారీ గ్రాఫిక్స్‌తో ‘ఢమరుకం’ చిత్రం చేసే అవకాశం వచ్చింది. షూటింగ్‌లో, విడుదలలో జాప్యం జరిగి అనుకున్న బడ్జెట్‌ని మించి పోవడంతో ఈమూవీ కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఇక విషయానికి వస్తే ఆ మధ్య దర్శకుడు శ్రీనివాసరెడ్డి సి.కళ్యాణ్ నిర్మాతగా ‘హలో బ్రదర్’ని రీమిక్స్ చేయాలని భావించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. దాంతో శ్రీనివాసరెడ్డికి దర్శకునిగా చాలా గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఆయన ఓ హర్రర్ సబ్జెక్ట్‌ని తయారు చేసుకుని అచ్చమైన తెలుగమ్మాయి, వరంగల్ పోరీ ఈషారెబ్బాకి వినిపించడం, కథ బాగా నచ్చడంతో ఈషా ఓకే చెప్పడం జరిగిపోయాయట. నటనా పరంగా, గ్లామర్ పరంగా కూడా వంకపెట్టలేని ఈ తెలుగు చిన్నదానికి అనుకున్న స్థాయి హిట్స్‌గానీ, క్రేజ్, ఇమేజ్‌లు గానీ రాలేదు.
ఇక ఈమె మొదటి నుంచి లవ్‌స్టోరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తూ రావడం, ప్రాధాన్యం లేని పాత్రలు, నాసిరకం చిత్రాలను ఒప్పుకుంటూ రావడం విశేషం. ఈమె కెరీర్‌లో ‘అమీతుమీ’ వంటి మంచి హిట్ ఉన్నా ఆ విజయం ఆమెకి సరిగా గుర్తింపును తేలేదు. సాధారణంగా హీరోయిన్లు తాము ఫేడవుట్ అయ్యేదశలోనే ఇలాంటి హర్రర్ చిత్రాలు ఒప్పుకుంటారనే అపవాదు ఉంది. కానీ నయనతార, అనుష్క వంటి వారు అది తప్పు అని నిరూపించారు. మరి ఈషారెబ్బా కూడా నయన, అనుష్క బాటలో నడుస్తుందా? లేక ఈ చిత్రంతో ఆమె ఫేడవుట్ అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది...!