స్థాయిని మించి విమర్శలు చేస్తే అవి చేటు చేస్తాయి. సామాన్యులకైతే నవ్వు తెప్పిస్తాయి. అందుకే జర్నలిజంలో ఓ కౌన్సిలర్ ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని విమర్శిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే నియమం ఉంది. స్థాయికి తగ్గ వారు మాత్రమే విమర్శలు చేయాలి. ఈ విషయం ఆమధ్య జగన్‌ని బట్టేబాజ్ అని తిట్టిన వేణుమాధవ్‌కైనా, పవన్, చంద్రబాబులను విమర్శిస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ, చిన్నికృష్ణ వంటి వారికి వర్తిస్తుంది. వీరి విమర్శలను పట్టించుకుంటే వారికి అనవసరపు ప్రాధాన్యం, ప్రచారం కల్పించడం అవుతుంది.
తాజాగా చిన్నికృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవికి ‘ఇంద్ర’ వంటి బ్లాక్‌బస్టర్ ఇస్తే కనీసం ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదు. పదిరూపాయలు ఖర్చుపెట్టి బాల్‌పెన్ కూడా కొనివ్వలేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చిరుతో పాటు పవన్‌పై కూడా చిన్నికృష్ణ తన అక్కసును వెల్లగక్కాడు. అందుకే పవన్‌పై తాజాగా చిన్నికృష్ణ చేసిన విమర్శల మీద ఆయన స్థాయికి తగ్గ రచయిత ఆకుల శివనే కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ, చిన్నికృష్ణ.. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. నేనే నిన్ను ఇంటికి పిలవను. అలాంటిది చిరంజీవి గారు ఇంటికి పిలుస్తారా? నేను రాసిన ‘నాయక్’ చిత్రం విజయం సాధిస్తే చిరంజీవి గారు నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ఐదులక్షలు బహుమతిగా ఇచ్చారు. తన 150వ చిత్రానికి రచయితగా పనిచేయమని కోరారు. అది ఆయన సంస్కారం.
వ్యక్తిగతంగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లను టార్గెట్ చేశావు కాబట్టే నేను రంగంలోకి దిగాను. నువ్వు మళ్లీ స్పందిస్తే, నీకు సంబంధించిన ప్రతి విషయం ఉన్న బుక్‌ని ఓపెన్ చేస్తాను. నీ ఇంటి పేరు నా ఇంటిపేరు ఒకటే. నీ గురించి నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. కొన్నేళ్ల కిందట చిన్నికృష్ణ సోదరుడు పోలీస్ కేసులో ఇరుక్కుంటే చిన్నికృష్ణ వచ్చి కాళ్లు పట్టుకుని బతిమిలాడితే నాకున్న పరిచయాలతో ఆయన్ను విడిపించాను. ఉజ్జయినీ మహంకాళి టెంపుల్‌లో నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నావు? దానికి సంబంధించిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. బయటకు తీయమంటావా?
‘ఇంద్ర’లోని గవర్నర్ ఎంటర్ అయ్యే సీన్, కామెడీ సీన్స్, నాది తెనాలి.. నీది తెనాలి.. అనే డైలాగ్స్ ఎవరు రాశారో తెలుసుకదా? చిరంజీవి గారు రైటర్‌గా నా పేరు వేసుకోమంటే ఏడ్చావు. దాంతో నేనే మౌనంగా ఉండిపోయాను. ‘నరసింహనాయుడు’ రాశావు. దానిపైన ఎన్ని గొడవలు అయ్యాయి? ‘ఆనంద పుంగాట్రె’ చిత్ర కథను కాపీ కొట్టి రాశావు. అది తెలిసి సి.కళ్యాణ్ నిన్ను కొట్టబోతే కాపాడింది ఎవరో గుర్తు తెచ్చుకో.. ఇప్పుడు నేను చెప్పినవి శాంపిల్స్ మాత్రమే. మరలా నోరెత్తావంటే నీ బుక్ మొత్తం ఓపెన్ చేస్తానని ఆకుల శివ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.