మన రాజ్యాంగంలో ఏముందో సామాన్యులకు తెలియదు గానీ మన రాజకీయ నాయకులు, బడా వ్యక్తులు మాత్రం ఇందులోని కొన్ని లొసుగులను వాడుకుంటూ ప్రయోజనం పొందుతూ ఉంటారు. మన రాజ్యంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. తన ఓటు, తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తనకి పడతాయో లేదో తెలియని వారు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి, చివరి నిమిషంలో ఎవరో ఇచ్చే ప్యాకేజీలకు లొంగవచ్చు. తద్వారా ఎన్నికల వ్యయాన్ని భారీగా పెంచుతున్నారు. ప్రధాన పార్టీల గుర్తులను పోలిన గుర్తులను పెట్టుకుని ఓటర్లతో గేమ్స్ ఆడుతుంటారు.
ఇక ఒక వ్యక్తి ఎన్నిచోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. మరి ఒక వ్యక్తి రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేస్తాడు. ఇది రాజ్యాంగ బద్దమే కానీ న్యాయబద్దం మాత్రం కాదు. ఆయన గెలిచిన రెండో చోట రాజీనామా చేయడం అంటే ఆ నియోజకవర్గ ఓటర్లను అవమానించడమే అవుతుంది. అలా రెండో చోట రాజీనామా చేస్తే మరలా ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ఖర్చు ప్రజల డబ్బు నుంచే దుబారా అవుతుంది. మరి ఉప ఎన్నికల ఖర్చుని రాజీనామా చేసిన ఆ వ్యక్తి నుంచే వసూేలు చేయాలనే వాదన ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది. అసలు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం అంటే తను నిలబడే చోట గెలుస్తాననే నమ్మకం లేకపోవడమేననేని కీలకాంశం. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరు కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఒక చోట ఓడి రెండో చోట గెలిచాడు. ఈసారి జనసేనాధిపతి గాజువాకతో పాటు భీమవరం నుంచి కూడా నామినేషన్ వేశాడు. రాజకీయాలను సమూలంగా మార్చి వేస్తానని చెప్పే వారికి ఇది తగని పని.
నిజానికి స్థానిక సర్వేల ప్రకారం పవన్ గాజువాక నుంచే కాదు.. భీమవరం నుంచి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ రెండుచోట్ల నుంచి పోటీ చేయడం అనవసరం. తద్వారా రాజకీయంగా భయపడే వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం మంచిది కాదు. పవన్ నామినేషన్‌కి భీమవరం మొత్తం కదిలి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత రెండు చోట్ల గెలిచే పవన్ గాజువాకని అట్టిపెట్టుకుని, భీమవరంను వదులుకోనున్నాడని ప్రచారం సాగుతోంది. ఇది పవన్‌పై తప్పుడు సంకేతాలను పంపుతుంది. ఇలాంటి పరిస్థితిని గమనించిన పవన్ తాను చేసే పని సరికాదనే ఉద్దేశ్యంతో భీమవరం నుంచి ఈనెల 28లోగా నామినేషన్‌ని ఉపసంహరించుకుంటాడిన అంటున్నారు. అదే పని పవన్ చేస్తే మంచి పనికి శ్రీకారం చుట్టిన వాడవుతాడు అనడంలో సందేహం లేదు.