రాజకీయాలు రూపు మార్చుకుంటున్నాయి. అలాగని ఓటర్లు కూడా తక్కువ తినలేదు. వారు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఏ పార్టీ సభకైనా సరే జనాలు భారీగానే హాజరవుతున్నారు. కాకపోతే దాదాపు అన్ని పార్టీలకి వచ్చే జనాలు అటు ఇటుగా వారే కావడం విచిత్రం. డబ్బు తీసుకుని, బిరియానీ ప్యాకెట్లు, మద్యం.. ఇలా దేనికైనా సరే మన ఓటర్లు సై అంటున్నారు. ఏ పార్టీ ఓటు వేయమని అడిగినా సరే అంటూ వారిచ్చిన తృణమో ఫణమో మొహమాటం లేకుండా తీసుకుంటున్నారు. కానీ ఓటు మాత్రం తమకి నచ్చిన అభ్యర్ధికే ముందుగానే ఖరారు చేసుకుంటున్నారు.
ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌కళ్యాణ్ రాష్ట్రమంతా తిరిగాడు. చరణ్, బన్నీలు రైలు యాత్ర కూడా చేశారు. పవన్‌ని కాస్త అల్లుఅరవింద్ లైట్‌గా తీసుకున్నాడు గానీ పవన్ మాత్రం తన శక్తివంచన లేకుండా కృషి చేశాడు. నాగబాబు తోటల్లో సమావేశాలు ఏర్పాటు చేశాడు. కానీ చిరంజీవికి వచ్చిన సీట్లు చూసుకుంటే మెగాహీరోల ప్రచారం ఏమి పనిచేయలేదనే చెప్పాలి. ఇక నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సీట్లలో కూడా టిడిపికి దక్కింది చాలా తక్కువ. ఈ లెక్కన ఈసారి పవన్ కేవలం తన బలం, సిద్దాంతాలు, తన ఓటు బ్యాంకు, తాను నిలబెట్టిన అభ్యర్ధులపై నమ్మకం ఉంచుతున్నాడే గానీ మెగా హీరోల ప్రచారంపై ఆధారపడేలా కనిపించడం లేదు. ఇది మంచి పరిణామమే. సినిమా నటులంటే జనాలు డబ్బులు ఇవ్వకున్నా ఆయా వారి ఫేస్‌లను చూసేందుకు పోలోమని వస్తారు. కానీ వారందరు ఓటు వేస్తారా? అంటే గ్యారంటీ లేదు.
ఈసారి ఎన్నికల్లో మెగా హీరోల ప్రచారం ఉంటుందా? లేదా? అనేది పెద్ద చర్చనీయాంశం కాదనే చెప్పాలి. అందుకే పవన్ ఎవ్వరినీ ప్రచారానికి రమ్మని బలవంతం చేసే పరిస్థితి లేదు. చిరు ఎలాగూ బయటకు రాడు. ఇక పవన్ ఈసారి గాజువాక, భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. మెగాబ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అయితే ఈమధ్య అల్లుఅరవింద్, బన్నీల విషయంలో మెగాభిమానులు బాగా హర్ట్ అయ్యారు. దాంతో మేమంతా కలిసే ఉన్నామని సంకేతాలు పంపడానికి మాత్రం మెగా హీరోల ప్రచారం ఉపయోగపడుతుంది తప్ప మరి దేనికి వారి ప్రచారం ఉపయోగపడదనేది వాస్తవం. అయితే పవన్‌కి తమ మద్దతు ఉందని చెప్పడానికి నేటి రోజుల్లో కేవలం ప్రచారానికి రావాల్సిన పనిలేదు. సోషల్‌మీడియా బాగా విస్తృతంగా ఉన్న నేపధ్యంలో మద్దతు ఇస్తున్నామని ఈ వేదిక ద్వారా ప్రచారం చేసినా సరిపోతుంది.
ఇక నాగబాబు మాత్రం మెగా హీరోల ప్రచారంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు. చిరంజీవి ఆజ్ఞ లేనిదే నాగబాబు జనసేన తరుపున ఎంపీగా పోటీ చేయడానికి ఒప్పుకుని ఉండదు. ఇక చరణ్-బన్నీలను ప్రచారం కోసం ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. తన తండ్రి కాబట్టి వరుణ్‌తేజ్ మాత్రం ఖచ్చితంగా నాగబాబుకి ప్రచారం చేస్తాడు. ఏదిఏమైనా పవన్ రాజకీయ సంకల్పం నచ్చి జనాలు ఓట్లు వేయాల్సిందే గానీ ఈ స్టార్స్ వచ్చిహడావుడి చేసినంత మాత్రాన ఓట్లు పడతాయని నిర్ణయానికి రాలేం. మొత్తానికి ఈసారి స్టార్ క్యాంపెయినర్స్‌ని చూసి కాకుండా అభ్యర్దుల వ్యక్తిగత మంచితనం మీదనో, సామర్ధ్యం మీదనో మాత్రమే ఓట్లు రావడం ఆధారపడి ఉంటుందనే చెప్పాలి.