సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా సినిమా స్టార్‌లు పెళ్లంటే రాష్ట్రం దాటేస్తున్నారు. లేదా ఏకంగా దేశమే దాటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ల పేరుతో ఉన్న సిటీని, రాష్ట్రాన్ని వదిలేని ఎక్కడో దూరంగా వివాహ వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. తామంటే తెలియని చోట వివాహాన్ని జరిపించడానికి ప్రాముఖ్యత నిస్తున్నారు. ఈ జాడ్యం ఈ మధ్య మరీ ఎక్కువై వింత పోకడలు పోతోంది. గతంలో పెళ్లంటే ఉన్న రాష్ట్రంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి తంతుని జరిపించేవారు. కానీ కాలంతో పాటు వారి అభిరుచులు కూడా మారుతుండటం..డబ్బుకు కొదవ లేకపోవడంతో గోవా, ఊటీ. ఇటలీ, యూరప్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి వివాహ వేడుకలు జరుపుకోవడం పరిపాటిగా మారిపోయింది.
నిర్మాత దిల్ రాజు తన కూతురు వెడ్డింగ్‌ని ఊటీలో స్టార్‌లని ఆహ్వానించి అంగరంగ వైభవంగా జరిపిన విషయం తెలిసిందే. ఆ పెళ్లిని మరవకముందే అక్కనేని వారి ఇంట జరిగిన నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో నిర్వహించి అక్కడికే టాలీవుడ్ స్టార్‌లని రప్పించారు. ఇటీవల బాలీవుడ్ జంట రణ్వీర్‌కపూర్, దీపికల పెళ్లి తంతు ఇటలీలోని లేక్ కోమోలో జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ స్టార్‌లెవ్వరూ హాజరు కాలేకపోయారు. కారణం ఇటలీకి వెళ్లలేకపోవడమే. ఇక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ వివహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం రాజస్థాన్‌లోని జయపురాలో తారాల కోలాహలం మధ్య జరిగింది. తాజాగా హీరో వెంకటేష్ కూతురు వివాహం కూడా అక్కడే జరగడం, ఈ వేడుకకు బాలీవుడ్ తరల్లో ముఖ్యులు పాల్గొని హంగామా చేయడం ఆకట్టుకుంది. స్వరాష్ట్రాన్ని వదిలి డెస్టినేష్ వెడ్డింగ్ పేరుతో రాష్ట్రాలు, దేశాలు దాడుతుండటం ప్రస్తుతం సెలబ్రిటీల్లో కొత్త ట్రెండ్‌గా మారడం విడ్డూరమే. పెళ్లంటే ఒకప్పుడు నూరేళ్ల పంట అన్నారు. ఇప్పుడు వేసవి విడిదిఅని..జాలీగా ఎంజాయ్ చేసే సందర్భమని అంటారేమో. తారల, సెలబ్రిటీల తంతు చూస్తే ఇకపై పెద్దల ఇంట పెళ్లంటే అలాగే చూసే పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి మరి.