మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ మంచి దశలో ఉంది. ఒకవైపున మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్, భారీ బడ్జెట్‌తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా బాహుబలి రేంజ్‌లో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా, నిహారిక, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సొంత కొణిదెల బేనర్‌లో ‘సై..రా..నరసింహారెడ్డి’ రూపొందుతోంది. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. మరోవైపు అంతకంటే ముందుగానే అంటే మే9వ తేదీన మహేష్ బెంచ్‌మార్క్ మూవీ అయిన 25వ చిత్రంగా ‘మహర్షి’ రిలీజ్ కానుంది. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి వంటి అగ్రనిర్మాతల భాగస్వామ్యంలో మహేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్‌గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇక ప్రభాస్ హీరోగా బాహుబలి సిరీస్ తర్వాత ‘సాహో’ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంంది. ఈ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల కానుంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని చిత్రాల కంటే ఎక్కువగా అందరు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న చిత్రం మాత్రం ఎన్టీఆర్, చరణ్‌ల కాంబినేషన్‌లో అసలుసిసలు మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే చెప్పాలి. రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడం, అసలుసిసలు మల్టీస్టారర్‌గా రూపొందుతూ ఉండటంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
వచ్చే ఏడాది జులై 30న విడుదల తేదీని కూడా ప్రకటించారు. దాదాపు 400కోట్లతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. 25శాతం షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్రం గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్ నటిస్తున్నాడు. ఒక హీరోయిన్‌గా అలియాభట్ యాక్ట్ చేస్తోంది. మరో హీరోయిన్‌గా విదేశీ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తోంది.
ఇక ఇందులో సంజయ్‌దత్‌తో పాటు యంగ్ హీరో వరుణ్‌ధావన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇది నిజమేనని వారిద్దరు ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్ కన్ను మరింతగా పెరిగింది. బాహుబలిలో కేవలం సౌత్ నటులనే యాక్ట్ చేయించి బాలీవుడ్‌ని గడగడలాడించిన రాజమౌళి ఈసారి అలియాభట్, అజయ్‌దేవగణ్, సంజయ్‌దత్, వరుణ్‌ధావన్‌లను తోడు తెచ్చుకుంటూ ఉండటం విశేషం. వరుణ్‌ధావన్‌కి ఇదే మొదటి సౌత్ చిత్రం. కానీ సంజయ్‌దత్ మాత్రం గతంలో నాగార్జున చంద్రలేఖతోపాటు రాబోయే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో కూడా నటిస్తున్నాడు.