వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలకు యాదార్ధ రూపం ఇస్తున్నానంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తీస్తున్నాడు. మార్చి 29న విడుదల తేదీని కూడా ప్రకటించాడు. కానీ ఇప్పటికీ సెన్సార్ విషయంలో ఎలాంటి అప్‌డేట్స్ లేవు. మరోవైపు టిడిపి వారు ఈ చిత్రం విడుదల కాకుండా ఉండేందుకు సుప్రీం కోర్టుకి వెళ్లాలని భావిస్తున్నారు. అయినా వర్మ మాత్రం తన పనిలో తాను ఉండి చిత్రం ప్రమోషన్స్‌ని చేస్తున్నాడు. అడిగిందే తడవుగా అన్ని చానెల్స్‌కి వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఇక తన తండ్రి బయోపిక్‌ని నందమూరి బాలకృష్ణ ‘కథానాయకుడు, మహానాయకుడు’గా తీశాడు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. చాలా సీన్స్‌లో ఎన్టీఆర్ పాత్రను పోషించిన బాలయ్యే కనిపించాడు గానీ నిజమైన ఎన్టీఆర్ కనిపించలేదనే విమర్శలు ఎదురయ్యాయి. అందుకే వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కోసం ఎవ్వరికీ పరిచయం లేని కొత్త ఆర్టిస్టుని తీసుకుని వచ్చాడు. ఇతడి ఫొటోలను చూసిన వారు మాత్రం అచ్చు ఎన్టీఆర్‌లా ఉన్నాడే అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. పాత్రలకి తగ్గ రూపురేఖలు ఉన్న వారిని వెతికి పట్టుకుని నటింపజేయడంలో వర్మని మించిన వారు లేరని మరోసారి స్పష్టమైంది.
ఇక తాజాగా వర్మ ఈ ఎన్టీఆర్ పాత్రధారిని కూడా పరిచయం చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ పాత్రకి ఎవ్వరినీ పరిచయం లేని వ్యక్తిని తీసుకోవాలని భావించాను. చివరకు రంగస్థల నటుడైన విజయ్‌కుమార్‌ని ఎంచుకున్నాను. ఆయనకు రెండు నెలల శిక్షణ ఇచ్చి ఈ చిత్రంలో నటింపజేశానని చెప్పుకొచ్చాడు. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథని, నాడు ఎన్టీఆర్ జీవితాన్ని ఇంతకాలం వర్మ లక్ష్మీపార్వతి ద్వారానో, లేక నాటి ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు, లక్ష్మీపార్వతి రాసిన పుస్తకాల ద్వారా సేకరించాడని అందరు భావిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో వర్మ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, నాడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితం మీద బయోపిక్ తీస్తున్నానని నాకు చెప్పాడు. నేను మాత్రం కాన్‌ఫ్లిక్ట్ ఉంటేనే చిత్రం చేస్తానని చెప్పాను. అప్పుడు బాలకృష్ణ నాటి ఎన్టీఆర్‌కి సన్నిహితులైన పలువురిని పరిచయం చేశాడు. వారి నుంచి సేకరించిన సమాచారంతోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథను తయారు చేసుకున్నాను.
అందుకే ఈ చిత్రాన్ని బాలయ్యకి అంకితం ఇస్తున్నాను. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఏ పార్టీ ఎన్నికల్లో గెలిచినా నాకు లాభమూ లేదు.. నష్టమూ లేదు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో, లేక వ్యతిరేకంగానో సినిమా తీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. పాతికేళ్ల ముందు జరిగిన కథ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ఉండవచ్చేమో గానీ వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? నేను ఫిల్మ్‌మేకర్‌నే గానీ బిజినెస్‌మేన్‌ని కాదని వర్మ తేల్చిచెప్పాడు.