సార్వత్రిక ఎన్నికలు, ఏపీ ఎలక్షన్స్ ఏప్రిల్ 30 నుంచి ఉంటాయని పలువురు భావించారు. అందునా ఏపీ, తెలంగాణలకు మొదటి విడతలోనే ఈ ఎన్నికలు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఏప్రిల్ 11న ఎలక్షన్లు రావడం అభ్యర్ధులు, పార్టీలు, మీడియాకే కాదు.. సినిమా వారికి కూడా తలనొప్పిగా మారింది. ముందుగా ఏప్రిల్5వ తేదీన ‘మజిలీ’ అన్నారు. అదే సమయానికి విడుదల కూడా చేస్తున్నారు. కానీ ఎన్నికలు, ఐపిఎల్‌ల పుణ్యమా అని ఈ చిత్రం మొదటి వారం ఓపెనింగ్స్‌పై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’ విడుదల కానుంది. ముందురోజే ఎన్నికలు పూర్తికావడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అందునా తమన్నా , ప్రభుదేవాల ‘అభినేత్రి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘దేవి 2’ చిత్రం ఏప్రిల్ 12న రావడం లేదు. పలు కారణాలతో ఈ చిత్రం విడుదల వాయిదాపడింది.
ఇక ఇప్పుడు చిక్కంతా యువహీరో నిఖిల్ సిద్దార్ద్ నటించిన ‘అర్జున్ సురవరం’ విషయంలోనే. తమిళ ‘కణిథన్’కి రీమేక్‌గా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఠాగూర్ మధు అండదండలు ఉన్నా ఇప్పటికే టైటిల్ ముద్ర విషయంలో డీలా పడిన అర్జున్ సురవరం టీంకి ఎన్నికలు చిక్కులో పడేశాయి. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఈనెల 29న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఎన్నికలకు ముందు మార్చి29న విడుదల చేస్తే కలెక్షన్లు తేడా వస్తాయనే ఆలోచనలో ఉన్నారు. దాంతో దీనిని మే1కి పోస్ట్‌పోన్ చేయాలని అనుకుంటున్నారట.
కానీ మే 9న మహేష్‌బాబు ‘మహర్షి’ రానుంది. అర్జున్‌సురవరం లాంగ్ రన్‌ని ఆశిస్తే మాత్రం మహేష్ పోటీలో ఉన్నాడు కనుక మరో తేదీని చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో పలు చిత్రాలు వాయిదాపడ్డాయి. నాగచైతన్య-గౌతమ్‌మీనన్‌ల సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి కూడా పెద్ద నోట్ల ఎఫెక్ట్ పడింది. కానీ కంటెంట్‌ని నమ్ముకుని వచ్చిన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు. పెద్దనోట్ల రద్దు ఈ చిత్రంపై ఏ ప్రభావం చూపలేదు. సో.. నిఖిల్ ఈనెల 29న వస్తేనే బాగుంటుందనే వాదన కూడా ఉంది.
ఇక కేశవ, కిర్రాక్‌పార్టీలతో పెద్ద హిట్స్ కొట్టలేకపోయిన నిఖిల్ అర్జున్ సురవరంతోనైనా మరలా ఊపులోకి వస్తాడో లేదో వేచిచూడాలి. ఈ చిత్రంలో నిఖిల్ మీడియా రిపోర్టర్‌గా నటిస్తున్నాడు. హీరోయిన లావణ్యత్రిపాఠి కూడా ఇందులో రిపోర్టరే. తెలుగులో మీడియా నేపధ్యంలో చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. గతంలో పవన్-పూరీలు కెమెరామెన్ గంగతో రాంబాబు చేసినా పెద్ద హిట్ కాలేదు అదే తమిళం నుంచి అనువాదమైన రంగం అద్భుత విజయం సాధించింది. మరి ఈ చిత్రం నిఖిల్‌కి ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాల్సివుంది!