చాలామందికి డబ్బుల నోట్లు, విదేశీ కరెన్సీ, నాణేలు, స్టాంప్‌లు వంటివి సేకరించడం హాబీగా ఉంటుంది. మరికొందరు అన్ని రకాల పత్రికలను కూడా సేకరిస్తూ ఉంటారు. మరి కొందరు పాతకాలం నాటి వస్తువులను దాచుకుంటూ ఉంటారు. అలాంటివే ఏదో ఒక సందర్భంలో ఎదుటివారికి ఉపయోగపడుతాయి. వాటి ద్వారా వాటిని సేకరించిన వారికి ఆర్ధికలాభం కూడా చేకూరుతుంది.
ఇక విషయానికి వస్తే గతంలో రాజమౌళి యుద్దం నేపధ్యంలో ‘మగధీర, బాహుబలి’ చిత్రాలను తీశాడు. అందుకోసం నాడు రాజులు ఉపయోగించిన గుర్రాలు, ఏనుగులు, కత్తి, డాలు, ఇతర సైనికుల, రాజుల దుస్తులు ఆయనకు అవసరం కావడంతో వాటిని అద్దెకు తెచ్చుకుని వాడుకున్నాడు. దానికి ఆయా వస్తువుల అధిపతులకు భారీగానే నగదు చెల్లించాడు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామచరణ్‌లు హీరోలుగా అసలుసిసలైన మల్టీస్టారర్‌గా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం నాటి నేపధ్యం కలిగిన కథ కావడంతో నాటి వ్యక్తులు వేసుకునే దుస్తులు, నాటి పోలీసులు, విప్లవవీరులు ఉపయోగించిన తుపాకులు, ఇతర ఆయుధాలతో పాటు నాటి బ్రిటిష్ కాలం నాటి కార్లు కూడా అవసరం అవుతున్నాయట. దాంతో ఆయన వీటిని బాడుగకు తీసుకుని మరీ పెద్ద మొత్తం వెచ్చించి వాటిని ఏకంగా ఏడాది పాటు అద్దెకు తెచ్చుకున్నాడని సమాచారం. 1920 నాటి కార్లను ఆయన బెంగుళూరుకి చెందిన కార్లవ్యాపారి రవిప్రకాష్ నుంచి ఆ కార్లను సేకరించాడట.
సాధారణంగా చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాల వారు ఈ వ్యాపారి నుంచి నాటి కాలం నాటి కార్లను ఒకటి రెండు రోజులు, మహా అయితే ఓ రెండు వారాలు అద్దెకు తెచ్చుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం ఆ కార్లను ఏకంగా ఏడాది పాటు అద్దెకు తీసుకోవడం విశేషం. ఇందుకుగాను దానయ్య నుంచి రవిప్రకాష్‌కి భారీగానే బాడుగ లభించిందని తెలుస్తోంది. మరి జక్కన్న చిత్రం అంటే ఆ మాత్రం భారీతనం ఉండాల్సిందేగా...! ‘అంతేగా.. అంతేగా’...!