పాత బ్లాక్‌బస్టర్స్ చిత్రాల టైటిల్స్‌ని నేటి చిత్రాలకు పెడితే, ఆయా పాత క్లాసిక్స్ పేరు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా పాత క్లాసిక్స్ టైటిల్స్‌తో వచ్చిన వాటిలో ‘గీతాంజలి, మల్లీశ్వరి’ వంటి కొన్ని చిత్రాలు మాత్రమే విజయవంతం అయ్యాయి. ‘శంకరాభరణం, శత్రువు, గణేష్, మాయాబజార్’ వంటి ఎన్నో చిత్రాలు పాత క్లాసిక్స్ పేరును చెడగొట్టాయి. ఇక దీనికి రివర్స్‌గా ఫ్లాప్ అయిన టైటిల్స్‌తో ప్రయోగం చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. గతంలో విడుదలై సరిగా ఆడని చిత్రాల టైటిల్స్‌ని మరోసారి తెరపైకి తెస్తుండటం విశేషం. గతంలో చిరంజీవి, నితిన్‌లు చేసిన ‘హీరో’ టైటిల్‌ని తాజాగా ఓ ద్విభాషా చిత్రం కోసం విజయ్ దేవరకొండ పరిశీలిస్తున్నాడని అంటున్నారు.
మరోవైపు 1988లో రాఘవను హీరోగా పరిచయం చేస్తూ పెద్ద వంశీ దర్శకత్వంలో భానుప్రియ సోదరి శాంతిప్రియ నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం మంచి చిత్రంగా పేరు తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ చిత్రం టైటిలే రాఘవకి ముందు ఇంటిపేరుగా చేరి ‘మహర్షి రాఘవ’గా గుర్తింపును తెచ్చింది. బ్రేకప్ లవ్‌స్టోరీ, ప్రేయసిని దూరం చేసుకున్న ప్రియుడు పిచ్చివాడు అయిపోవడం, చివరలో తన మాజీ ప్రియురాలి పాప కోసం తన ప్రాణాలు త్యాగం చేసే విషాదాంత ముగింపుతో ఈ చిత్రం ఉంటుంది. ఇళయరాజా ఇచ్చిన పాటలను ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు.
ఈ చిత్రం విడుదలై రెండు దశాబ్దాలు దాటిన తర్వాత మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. అయితే పాత ‘మహర్షి’ లవ్ ట్రాజెడీ చిత్రం కాగా, మహేష్ నటిస్తోన్న ‘మహర్షి’ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. రివర్స్ సెంటిమెంట్‌తో ఫ్లాప్ మూవీ టైటిల్‌ని నమ్ముకుని వస్తోన్న ‘మహర్షి’ చిత్రం మే9న విడుదల కానుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రమోషన్స్ వేగాన్ని పెంచునున్నారు.