కొంతకాలం పవన్ ట్వీట్లకే అంకితం అయ్యాడు. దాంతో అందరు ఆయన్ను ట్వీట్ల పులి అని సెటైర్లు వేశారు. తర్వాత పలు ప్రాంతాలలో పర్యటిస్తూ, ప్రసంగాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎమ్మెల్యే, ఎంపీల టిక్కెట్ల ఖరారు, బిఎస్పీ, వామపక్షాలతో పొత్తులు అంటూ సాగుతూ వేగంగా పావులు కదుపుతున్నారు. స్వయంగా ఆయన విశాఖపరిధిలోని గాజువాక నుంచి మరోవైపు భీమవరం నుంచి పోటీకి దిగుతున్నాడు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, విశాఖ నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. వీరి గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక తాజాగా తన సోదరుడు నాగబాబుకి పవన్ నరసాపురం ఎంపీ సీటు ఇచ్చాడు. ఈ సందర్భంగా నాగబాబు ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు. తాను తన సోదరుడి కోసం దేనికైనా సిద్దమేనని, రాబోయే రోజుల్లో తన తడాఖా ఏమిటో చూపిస్తానని తెలిపాడు. తమ్ముడు కోరుకుంటే తాను ఆఫీస్‌నైనా క్లీన్ చేస్తాను.. సమాజాన్ని అయినా క్లీన్ చేస్తానని ప్రకటించాడు. ఇక ఇలా నాగబాబుని చేర్చుకుంటే లోకేష్‌పై తాను చేసే వ్యాఖ్యలు, వారసత్వాలకు విలువ ఉండదని భావించిన పవన్.. నా సోదరుడిని దొడ్డి దారిన ఎంపీని చేయాలని నేను భావించడం లేదు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి దింపుతున్నాను. ప్రజలతో మమేకమయ్యేలా, వారి ఓట్లు సాధించమని చెప్పానేగానీ దొడ్డిదారిన ఎమ్మెల్సీగా మంత్రిగా చేయడం లేదని తేల్చిచెప్పాడు.
ఇక పవన్ ఇటీవల తాను బిఎస్పీతో పొత్తు పెట్టుకుంటూ దేశంలోని ఎందరో మాయావతిని పీఎంగా చూడాలని భావిస్తున్నారు. అందులో నేను ఒకడిని అని చెప్పాడు. కానీ ఈసారి ఎన్నికల్లో మాయావతి ప్రచారాలకే పరిమితం అవుతుందని, ఆమె పార్లమెంట్‌కి పోటీ చేయడం లేదనేది స్పష్టం. టోటల్‌గా చూస్తే ఏపీలో మొత్తం 60 సీట్లపై పవన్ కల్యాణ్ గట్టిగా ఫోకస్ పెట్టాడనేది తెలుస్తోంది. ఇక పవన్ భీమవరం నుంచే కాక గాజువాక నుంచి కూడా పోటీ చేయనున్నాడు. ఇక భీమవరం నుంచి ఆయనపై పోటీగా వైసీపీ అభ్యర్ధి శ్రీనివాస్ గ్రంథికే సీటుని కేటాయించింది. 2014లో కూడా ఈయన ఇక్కడి నుంచే పోటీ చేశాడు.
ఇలా పవన్‌ని ఢీకొనే వైసీపీ ప్రత్యర్ధిగా ఇప్పుడు గ్రంథి కేరాఫ్ అడ్రస్‌గా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్‌ని గ్రంథి ఓడించి, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలో శ్రీనివాస్ గ్రంథి పేరు ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ వర్గం వారు అంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో పవన్, గ్రంథిలో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సివుంది....!