జనసేనాని పవన్‌కళ్యాణ్ కూడా మొదట తాను అధికారంలోకి రావాలని పార్టీ పెట్టలేదు అని చెప్పాడు. ‘కర్ణాటక’ తరహాలోనే ఈసారి ఏపీ ఎన్నికలు ఉంటాయని, తనకు పదిలోపు సీట్లు వస్తాయని అంటున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన కీరోల్ పోషిస్తుందన్నాడు. టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా తమ మద్దతు తప్పనిసరి అని చెప్పాడు. ఈసారి సీట్ల కంటే పడే ఓట్ల శాతానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన ఆయన ఇటీవల మాత్రం కాబోయే ముఖ్యమంత్రిని నేనే.. ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతున్నాడని ప్లేట్ మార్చాడు. ఈ విషయంలో పలువురు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
ఇక అదే కే.ఏ.పాల్ విషయానికి వస్తే ఆయన మరీ సర్కస్‌లో బఫూన్‌లాగా మారిపోతున్నాడు. ట్రంప్ కూడా తన సలహాలు తీసుకుంటాడని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్దాలను తాను ఆపానని, తనకి కోపం తెప్పించినందువల్లే వైఎస్‌ఆర్‌కి ఆ దుర్గతి పట్టింది అంటూ నానా హంగామా చేస్తున్నాడు. ఇక విషయానికి వస్తే తాజాగా జనసేనాని పవన్‌కళ్యాణ్ తన సోదరుడు, అన్నయ్య మెగాబ్రదర్ నాగబాబుని పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం ఎంపీ సీటు ఇచ్చాడు. ఇంతకాలం తనకి తన ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదని, వారికి సీట్లు ఇవ్వనని, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని చెబుతూ వస్తున్న పవన్ తాజాగా మాట మార్చి నాగబాబుకి ఎంపీ సీటు ఇచ్చాడు. దీనిపై కె.ఎ.పాల్ స్పందన నవ్వులలో ముంచెత్తుతోంది.
మెగాబ్రదర్ నాగబాబు గానీ పవన్‌గానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పిన పాల్ తాజాగా నాగబాబుని నరసాపురం నుంచి ఓడిస్తానని చెప్పకుండా మీ సొంత ఊరు పాలకొల్లు నుంచి దమ్ముంటే పోటీ చేయి. నీకు పోటీగా నేను పోటీచేస్తానని జోక్‌లు పేల్చాడు. తమ గాలిలో అందరు కొట్టుకుపోతారని, ఏపీలో అసలైన పార్టీగా ప్రజాశాంతి పార్టీ ఆవిర్భవిస్తుందని సెలవిచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మనకి కావాల్సింది నటులు కాదు.. అభివృద్ది కావాలి.. నిరుద్యోగం పోవాలి. అధికారంలోకి వస్తే ప్రతి ఊరిలో అపోలో హాస్పిటల్ తరహా ఆసుపత్రిని నిర్మిస్తాను. అమెరికాను మించి పోయేలా ఏపీని అభివృద్ది చేస్తాను.
28 లక్షలు ఖర్చుపెడితే మీరే ఎమ్మెల్యే, 50లక్షలు ఖర్చుపెడితే మీరే ఎంపీ. ఈ విషయంలో కేజ్రీవాల్‌ని ఆదర్శంగా తీసుకోండి. ఏడు లక్షలతో 15ఏళ్లు ధిల్లీని పాలించిన షీలాదీక్షిత్‌ని కేజ్రీవాల్ ఓడించాడు. నాకైతే ఏడు లక్షలు కూడా అవసరం లేదు. ఐదు లక్షలు సరిపోతాయి.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకాలం తానే అందరికీ ఆదర్శం అని చెప్పిన పాల్ ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్‌ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం కొసమెరుపు.