ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు.. ఎన్టీఆర్, చంద్రబాబులని హీరోలుగా చూపెట్టడానికే సినిమాలు చేశారు అనే విషయం సగటు ప్రేక్షకుడు గ్రహించబట్టే.. ఆ సినిమాలు భారీ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలైన ఘటనలు చూపెట్టకుండా అసంపూర్ణంగా ఆ సినిమాల ముగింపు.... ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మరి ఎన్టీఆర్ జీవితం చరమాంకంలో జరిగిన అనేక చేదు ఘటనలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించాడు. టిడిపి, బాలకృష్ణ మీదున్న కోపంతో వర్మ ఆ సినిమాని తీసినా.. అందులో వాస్తవాలు లేకపోలేదు. ఎన్టీఆర్‌తో లక్ష్మీపార్వతి పెళ్లి, ఆయన మరణం అన్నీ వర్మ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
అందుకే సినిమాకి కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అందులోను ఎలక్షన్స్ మూమెంట్‌లో వర్మ ఈ సినిమాని విడుదల చెయ్యడం కూడా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడడానికి కారణమయ్యింది. అయితే భారీ అంచనాల నడుమ మార్చి 29న థియేటర్స్ లో రాబోతున్న ఈ సినిమా విడుదలయ్యాక కూడా ఆ క్రేజ్ ని మెయింటింగ్ చేస్తుందా? ప్రస్తుతం డల్‌గా ఉన్న బాక్సాఫీస్ మీద వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వదలడం కరెక్ట్ అయిన పనే. సినిమా మీదున్న అంచనాలతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా ఆడెయ్యడం గ్యారెంటీ. అంతలా సినిమాల కోసం కరువాసిపోయి ఉన్నారు జనాలు. అలాంటి టైం లో లక్ష్మీస్ ఎన్టీఆర్ దిగుతుంది. మరి వర్మ ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడా... సినిమా సూపర్ హిట్. లేదా వర్మ డిజాస్టర్స్ లో అదొకటి.
అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వర్మ ఫ్రీ పబ్లిసిటి బాగానే ఉంది కానీ.. ఆ సినిమా స్క్రీన్ మీద చూడాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే సినిమా క్వాలిటీ నాసిరకంగా కనబడుతుంది. అలాగే ఆర్టిస్ట్స్ కూడా ఎవరికీ తెలియని మొహాలు కావడం, అలాగే వర్మ గత చిత్రాల డిజాస్టర్స్ చూస్తే.. వర్మ డైరెక్షన్ మీద అపనమ్మకం వెరసి సినిమా టాక్ మీద వర్మ భవిష్యత్తు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మరో గండం... ఏప్రిల్ 5న నాగ చైతన్య - సమంతల మజిలీ సినిమా విడుదలవుతుంది. మజిలీ సినిమా మీద భారీ క్రేజ్ ఉంది. ఎందుకంటే భార్యాభర్తలు అయ్యాక చైతు, సామ్ కలిసి నటించిన మొదటి సినిమా కావడం, శివ నిర్వాణకు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం.. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఓకే... లేదంటే మజిలీ ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సి ఉంటుంది.