ఒకప్పుడు గయ్యాళి అత్త, పొగరుబోతు భార్య వంటి పాత్రలే ఎక్కువగా కనిపించేవి. అంతేకానీ ఫుల్‌లెంగ్త్‌లో మహిళా విలన్లు కనిపించేవారు కాదు. కానీ ప్రస్తుతం బుల్లితెరపై ఏ చానెల్‌లోని సీరియల్‌ని చూసినా అందులో లేడీ విలన్లే కనిపిస్తూ ఉన్నారు. మహిళలను కూడా క్రూరంగా చూపించే ట్రెండ్ మొదలైంది. ఇక మన సినిమాలలో ఒకనాటి హీరోయిన్లు అయిన నళిని ‘వీడే’, సరిత ‘అర్జున్’ చిత్రాలలో లేడీడాన్స్‌గా కనిపించారు. ఎంతో సాఫ్ట్ పాత్రలు చేసిన సౌందర్య సైతం ఆర్.ఆర్. షిండే దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నామనసిస్తా..రా’లో విలన్ పాత్రని చేసింది.
ఇక కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, సౌందర్య జంటగా వచ్చిన ‘నరసింహా’ చిత్రంలో నీలాంబరి పాత్ర రమ్యకృష్ణకి ఎంత పేరు తెచ్చింది అనేది అందరకీ తెలుసు. ఈ చిత్రం ఆమె కెరీర్‌లోనే ఓ ఆణిముత్యమని చెప్పాలి. ఈ పాత్రే ఆమెకు ‘బాహుబలి’ వంటి చిత్రంలో చాన్స్ దక్కేలా చేసింది. ఇలా రమ్యకృష్ణ కెరీర్‌లో ఇది ఓ అద్భుతమైన మలుపు చిత్రమనే చెప్పాలి. ఇలా పలువురు నటీమణులు లేడీ విలన్స్‌గా మారుతున్నా వారంతా హీరోయిన్లుగా ఫేడవుట్ అయిన తర్వాతే అలాంటి పాత్రలు చేస్తున్నారు.
కానీ ఫామ్‌లో ఉండగానే మిల్కీబ్యూటీ తమన్నా ఓ చిత్రంలో లేడీ విలన్ పాత్రను చేయడానికి ఓకే చెప్పిందనే వార్త హాట్‌టాపిక్ అయింది. ఇటీవల తమన్నా ఫేడవుట్ అవుతోంది అనుకుంటున్న సమయంలో ‘బాహుబలి’ తో మరలా ఫామ్‌లోకి వచ్చింది. ఇటీవల వచ్చిన ‘ఎఫ్2’లో తన అందచందాలు, నటనతో మెప్పించింది. చిరంజీవి సైతం ఈ నాటి హీరోయిన్లలో తనకు తమన్నాతో నటించాలని ఉందని చెప్పాడు. అలా ఆమెకి చిరు నటిస్తున్న ప్రతిష్టాత్మకచిత్రం ‘సై..రా..నరసింహారెడ్డి’లో ఓ పాత్ర లభించింది. ప్రస్తుతం ఆమె ‘అభినేత్రి’ తర్వాత ‘దేవి2’ చిత్రంలో మెయిన్ రోల్‌లో నటిస్తోంది.
బాలీవుడ్ ‘క్వీన్’కి రీమేక్‌గా రూపొందుతున్న ‘దటీజ్ మహాలక్ష్మి’లో కంగనారౌనత్ చేసిన పాత్రను చేస్తోంది. తాజాగా ఆమె విశాల్ నటించే చిత్రంలో క్రూరమైన విలన్ పాత్రను పోషిస్తోందని సమాచారం. విశాల్ ఎత్తులకు పై ఎత్తులు వేసే పాత్ర ఇది. మైండ్‌గేమ్ ఆడే రోల్ అట. ఇలా విలన్‌గా నటించడం ఈమెకి ఇదే మొదటిసారి. ఇక విశాల్ చిత్రాలలో లేడీ విలన్లు ఉంటే అవి ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తాయనే సెంటిమెంట్ ఉంది. ‘పొగరు’లో శ్రియారెడ్డి, ‘డిటెక్టివ్’లో ఆండ్రియా, ‘పందెం కోడి2’లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు లేడీ విలన్స్‌గా మెప్పించారు. ఈ చిత్రాలు మంచి విజయంసాధించాయి.
ఇక ‘విఐపి2’లో కాజోల్, ‘సర్కార్’ చిత్రాలలో కూడా లేడీ విలన్ పాత్రలు బాగా మెప్పించాయి. ఇక ఈ చిత్రం కనుక హిట్ అయితే రాబోయే రోజుల్లో తమన్నా హీరోయిన్‌గానే కాకుండా ఇలాంటి పాత్రల ద్వారా కూడా తన కెరీర్‌ని మరికొంత కాలం డోకాలేకుండా సాగుతుందనే చెప్పాలి. మొత్తానికి హీరోయిన్‌గా కూడా రాణిస్తున్న సమయంలో తమన్నా లేడీ ఓరియంటెడ్ పాత్రలతో పాటు ఇటు నెగటివ్ పాత్రలను కూడా దక్కించుకుంటూ ఉండటం ఆమె అదృష్టమనే చెప్పాలి.