మెగాకాంపౌండ్‌లో అటు ఇటుగా దాదాపు డజన్ మంది నటీనటులు ఉన్నారు. తెలుగు సినిమాలలో అత్యధిక శాతం ఈ మెగాకాంపౌండ్ నటీనటులకే వాటా దక్కుతుంది. ఇక తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకునిగా పరిచయం అవుతూ, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ల నిర్మాణభాగస్వామ్యంలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం బెస్తవారి నేపధ్యంలో సాగుతుంది. కోనసీమ నేపధ్యంలో చేపలు పట్టేజాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ చిత్రం నాటి మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని జంటగా భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘ఆరాధన’ చిత్రం తరహాలో సాగుతుందని అంటున్నారు.
కాగా ఈ చిత్రంలో తమిళ యంగ్‌స్టార్ విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. విజయ్‌సేతుపతి ఇటీవల వరుస హిట్స్ సాధిస్తున్నాడు. ‘సూపర్‌డీలక్స్’ విడుదలకు సిద్దంగా ఉంది. మరో మూడు నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇక ఈయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సై..రా..నరసింహారెడ్డి’లో ఓబయ్య అనే కీలకపాత్రను చేస్తున్నాడు. ఇక వైష్ణవ్‌తేజ్ చిత్రంలో విజయ్ పాత్ర హీరో పాత్రకి పోటాపోటీగా ఉంటుందని, ఎంతో పవర్‌ఫుల్ పాత్ర కావడం వల్లే ఇందులో విజయ్ నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ విషయం తెలిసిన వైష్ణవ్‌తేజ్ అన్నయ్య సాయిధరమ్‌తేజ్ తాజాగా విజయ్ సేతుపతికి కృతజ్ఞతలు తెలిపాడని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అంటే ఆటోమేటిగ్గా ఈ చిత్రానికి తమిళంలో కూడా క్రేజ్ వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి నేపధ్యం ఉన్న చిత్రాలను తమిళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. దాంతో వైష్ణవ్‌తేజ్ ఒకే దెబ్బకి టాలీవుడ్, కోలీవుడ్‌లతో రెండు పిట్టలను కొట్టనున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ని ఇంకా ప్రకటించలేదు. ఇందులో విజయ్ సేతుపతి బెస్తవారి నాయకునిగా, తన కనుసన్నల్లో వారిని ఉంచుకునే పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే పంజా వైష్ణవ్‌తేజ్‌కి మొదటి చిత్రమే అత్యంత కీలకం కానుంది అనేది మాత్రం వాస్తవం.