మనకు హాని చేసిన వాళ్లని మర్చిపోయినా పరవాలేదు కానీ సహాయం చేసిన వాళ్లని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అంటారు. అదే మాటల్ని చేతల్లో చేసి చూపిస్తున్నాడు కన్నడ రాక్‌స్టార్ యష్. `కేజీఎఫ్` సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రేజీ స్టార్‌గా మారిపోయాడు యష్. ఒకే ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా స్టాగా మారిపోయాడు. అయితే తనకొచ్చిన క్రేజ్‌తో పొంగిపోకుండా తనకు అత్యవసర సమయంలో అండగా నిలిచిన వారికి తాను అండగా నిలుస్తున్నాడు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ చాలా మంది యంగ్ హీరోలకు అండగా నిలిచారు. అలా అంబరీష్ అండతో పైకి వచ్చిన హీరోల్లో యష్ ఒకరు.
అది గుర్తుపెట్టుకున్న యష్ తనకు అండగా నిలిచిన వారి రుణం తీర్చుకోవడానికి ముందుకొచ్చాడు. ఇటీవల అనారోగ్యంతో అంబరీష్ మృతిచెందిన విషయం తెలిసిందే. కర్ణాటక మాండ్య నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అంబరీష్ మరణంతో ఆ స్థానం ఖాలీ అయ్యింది. అయితే ఆ స్థానం నుంచి అంబరీష్ భార్య, నటి సుమలత పోటీ చేయాలని మాండ్య ప్రజలు కోరుకుంటున్నారు. అయితే అది కుదరదని చెప్పిన జేడీఎస్, కాంగ్రెస్ సుమలతకు టికెట్ నిరాకరించాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా సుమలత రంగంలోకి దిగింది. ఆమెకు అండగా `కేజీఎఫ్` స్టార్ యష్, మరో హీరో దర్శన్ నిలబడుతున్నారు.
అయితే సుమలతకు పోటీగా మాండ్యా నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తనకు అక్కలాంటి సుమలతను మాండ్య నుంచి ఎంపీగా గెలిపించడమే లక్ష్యంగా యష్ మరో హీరో దర్శన్‌తో కలిసి ప్రచారం మొదలుపెట్టడం కన్నడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. యష్ కోరుకున్నట్టే మాండ్య నుంచి సుమలత ఎంపీగా గెలుస్తుందా? యష్ తన ఇమేజ్‌తో సుమలతను విజయతీరాలకు చేరుస్తాడా? అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.