హిందీ ‘బిగ్‌బాస్’ స్థాయిలో కాకపోయినా తెలుగులో స్టార్ మాలో వచ్చిన ‘బిగ్‌బాస్’ బాగానే ఆదరణ పొందుతోంది. తెలుగు ‘బిగ్‌బాస్’ తొలి సీజన్‌కి ‘జై లవకుశ’ షూటింగ్ బిజీలో ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుని కార్యక్రమాన్ని రక్తి కట్టించాడు. ఇలా మొదటి సీజన్‌ని ఒంటి చేత్తో ఎన్టీఆర్ విజయపధంలోకి తీసుకుని వచ్చాడు. కానీ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్‌లో కూడా పార్టిసిపెంట్స్ మధ్య విభేదాల కారణంగా పలు విమర్శలు వచ్చాయి. ఇక ఈ షో రెండో సీజన్‌ని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఈసారి కూడా పార్టిసిపెంట్స్ ఎంపిక నుంచి వారి మధ్య పలు విభేదాల కారణంగా నాని సోషల్‌మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. దాంతో మరోసారి తాను ఈ షోకి హోస్ట్‌గా ఉండనని నాని తేల్చిచెప్పాడు.
ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘బిగ్‌బాస్’ సీజన్3పై ఉంది. మొదట దీనికి విక్టరీ వెంకటేష్ హోస్ట్‌గా చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ తనకు ఈ షో మొదటి సీజన్‌కే చాన్స్ వచ్చిందని, కానీ తాను ఇలాంటివి చేయనని వెంకీ కుండబద్దలు కొట్టాడు. ఇక రెండో సీజన్‌కి ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాని వంకగా చూపించిన జూనియర్ ఈసారి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ బిజీలో ఉండటాన్ని కారణంగా చూపి నో అన్నాడని సమాచారం. ఇక మూడో సీజన్‌కి విజయ్ దేవరకొండ పేరు కూడా బాగానే వినిపించినా రేసులో ఆయన లేడని స్పష్టమైంది.
తాజాగా ఈ చాన్స్ కింగ్ నాగార్జున వద్దకు వెళ్లిందని, దాంతో ఆయన ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఒకవైపు నాగ్ వ్యాపారాలు, తన సినీ కెరీర్, తన కుమారులైన నాగచైతన్య, అఖిల్ వంటి వారి కెరీర్స్‌ని చక్కబెట్టడం వంటి పలు విషయాలలో బిజీగా ఉన్నాడు. మరోవైపు తానే నిర్మాతగా ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌లో నటిస్తున్నాడు. నాగ్‌కి ‘మీలోఎవరు కోటీశ్వరుడు’ అనే షోని హిట్ చేసిన ఘనత ఉంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కి మొదట నాగ్, తర్వాత చిరులు హోస్ట్ చేశారు.
కానీ చిరుతో పోల్చుకుంటే ఈ షోని విజయవంతంగా నడిపిన ఘనత నాగ్‌కే చెందుతుంది. అంతేకాదు.. నాగ్‌కి స్టార్ మాతో అవినాభావ సంబంధం ఉంది. దాంతో నాగ్ ఈసారి ‘బిగ్‌బాస్ 3’ని ఓకే చేశాడని సమాచారం. జూన్ నుంచి ఇది ప్రారంభం కానుంది. మొదటి రెండు సీజన్స్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ‘బిగ్‌బాస్’ని ఎలాగైనా విజయవంతం చేయాలనే పట్టుదలలో కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారు.