మంచుమోహన్‌బాబుకి నటునిగా, విలక్షణ పాత్రలను మెప్పించే వ్యక్తిగా, డైలాగ్‌కింగ్‌గా ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో విభిన్నపాత్రలు చేయడంతో పాటు నిర్మాతగా కూడా 50 చిత్రాలను నిర్మించిన ఘనతను సాధించుకున్నాడు. ఇక ఈయన వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్, వారసురాలు మంచు లక్ష్మిలు మాత్రం తమ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు మనోజ్‌లు హీరోలుగా పెద్దగా రాణించలేకపోతున్నారు.
కానీ వీరు తమ కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ముందుంటారు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా వీరు వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలాంటి వీరు తాజాగా తమ తండ్రి మోహన్‌బాబు 69వ జన్మదినోత్సవం సందర్భంగా తమలోని గొప్పతనాన్ని మరోసారి నిరూపించారు. తండ్రి పుట్టినరోజు కానుకగా సిరిసిల్లకి చెందిన అశ్విత అనే పాపను మంచు మనోజ్ దత్తత తీసుకున్నాడు. అశ్విత ఎంతో ప్రతిభ కలిగిన అమ్మాయి అని, ఆమె ఐఎఎస్ కావాలని కోరుకుంటోందని, ఈ పాప బాధ్యతలను ఇక నుంచి నేనే చూసుకుంటానని.. తిరుపతిలోని మా కాలేజీలోనే ఈమెకి ఉచితంగా చదువు చెప్పిస్తానని మంచు మనోజ్ ప్రకటించాడు.
మరోవైపు తండ్రి పుట్టిన రోజు సందర్బంగా మంచు విష్ణు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కోసం ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. రుయా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, ఐసియుల అభివృద్దికి ఆయన ఈ కోటి రూపాయలను ప్రకటించడం విశేషం. మొత్తానికి మంచు వారసులు తాము రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్‌లోనే హీరోలమని నిరూపించుకోవడంతో వారిని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.