ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా)’ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ పై నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ శివాజీ రాజా ఇంకా పదవి పట్టుకునే వేలాడుతున్నారని.. తన పదవి మార్చి 30 వరకూ ఉందని శివాజీ రాజా మాకు అడ్డుపడుతున్నారని తాజాగా నరేష్ ప్యానల్ వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. నరేష్ ప్రమాణ స్వీకారానికి శివాజీరాజా అడ్డుపడుతున్నాడని కూడా ఈ ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపై శివాజీరాజా మండిపడ్డారు.
తాజాగా ఈ విషయంపై శివాజీ రాజా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో శివాజీ రాజా మాట్లాడుతూ.. “నరేష్ ప్రమాణ స్వీకారాన్ని నేనేమి అడ్డుకోవట్లేదు. రూల్స్ ప్రకారం ఈ నెలాఖరు వరకూ నాకు టైం ఉందని మాత్రమే చెప్పాను. బై లాలో నాకు 30 వరకు టైం వుంది. 22 న వారు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 1 నుండి వారు ఛార్జ్ తీసుకోవచ్చు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు ప్రత్యక్షంగా నరేష్ కి సపోర్ట్ చేయరు. కొత్త వారికి అవకాశమివ్వాలనే నాగబాబు, నరేష్ ప్యానెల్ కి సపోర్ట్ ఇస్తున్నట్టు ఎన్నికల ముందు మాకు చెప్పారు. గోల్డేజ్ హోం కట్టడం నా కల, ఇప్పుడు దానిపై నీళ్ళు జల్లుతున్నారు. నరేష్ ప్యానెల్ వారు గోల్డేజ్ హోం కట్టిస్తే.. కాశీ నుండి నీళ్ళు తెచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాను. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా ఈ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన రుణం మాత్రం తన జీవితంలో తీర్చుకోలేను.. అంటూ శివాజీ రాజా తెలిపారు.