1980-90ల కాలంలో తీవ్రవాదం, ముఖ్యమంత్రులు, వారి రక్షణ సిబ్బంది.. ఇలా పలు అంశాలతో మలయాళంలో సురేష్ గోపీ, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారు ఎన్నో చిత్రాలు చేసేవారు. పోలీస్, ఆర్మీ నేపధ్యంలో సాగే ఆ చిత్రాలు నాడు అనువాదమై తెలుగులో కూడా మంచి విజయాలనే అందుకున్నాయి. మరలా ఇంతకాలం తర్వాత అదే తరహా చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ సూర్య చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ప్రస్తుతం సూర్య వరుస పరాజయాలతో కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ చిత్రం చేస్తున్నాడు. దీనితో పాటు ఆయన మరో చిత్రంగా ‘రంగం’ వంటి మీడియా నేపధ్యం ఉన్న చిత్రాన్ని తీసిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్యతో ‘కాప్పన్’ అనే చిత్రం తెరకెక్కిసున్నాడు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన మంత్రి పాత్రను పోషిస్తుండగా, ప్రధానిని కాపాడే సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సూర్య పాత్ర ఉంటుందని సమాచారం.
ఇక తమిళనాట పలు చిత్రాలలో హీరోగానే కాదు.. తెలుగులో రానా తరహాలో పాత్రలో దమ్ముంటే ఏ పాత్రనైనా పోషించే ఆర్య ప్రధానమంత్రిని చంపే పని మీద ఉండే తీవ్రవాదిగా కనిపించనున్నాడట. ఈ పాత్రను దర్శకుడు అద్భుతంగా మలిచాడని అంటున్నారు. గతంలో తెలుగులో కూడా ఆర్య, అల్లుఅర్జున్ నటించిన ‘వరుడు’ చిత్రంలో విలన్ పాత్రను పోషించాడు. ఇప్పటికే 75శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ‘ఎన్జీకే’ తర్వాత విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం హిట్టయితే మరోసారి ఇదే తరహా చిత్రాలు ఊపందుకునే చాన్స్ ఉందనే చెప్పాలి.