ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలంటే వాటిని తమ పిల్లలు చూడటానికి పెద్ద వారు అంగీకరించేవారు. నాడు మలయాళం, బాలీవుడ్, హాలీవుడ్‌లతో పాటు కన్నడలో కాశీవిశ్వనాథ్ వంటి వారు ఈ తరహా సి గ్రేడ్ చిత్రాలను తీసేవారు. నాడు ‘ఎ’ సర్టిఫికేట్ అంటే అదో తప్పు అనే భావన ఉండేది. కానీ నేడు మరీ పట్టుబట్టి ‘ఎ’ గ్రేడ్ సర్టిఫికేట్ తెచ్చుకుని, యువతను ఆకర్షించేందుకు తమది పెద్దల చిత్రమని ఢంకా భజాయిస్తున్నవారి తీరు ఆందోళనకరంగా మారింది. ఈ వాదన వస్తే చాలు కొందరు వితండవాదాలు చేస్తున్నారు.
యూట్యూబ్‌లలో, టివి కార్యక్రమాలలోనే ఇంతకు మించిన వల్గారిటీ ఉన్నప్పుడు తమని తప్పుపట్టడం ఏమిటి? అని సినిమా వారు వాదిస్తారు. సినిమాలే అంత విచ్చలవిడిగా ఉన్నప్పుడు తమ ‘జబర్ధస్త్’ వంటి షోలను తప్పుపట్టడం ఏమిటనేది మరొకరి వాదన. ఇలా రెండు వైపులా ఎవరికి వారు వాదన చేసుకుంటూ తప్పుని ఇతరులపై తోసివేస్తున్నారు. పిల్లలకు ఐఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఇచ్చే తల్లిదండ్రులు తమ చిత్రాలలోని బూతుని ప్రశ్నించడం ఏమిటి? అనేవాదనను కొందరు తెరపైకి తెస్తారు. మరి వారి పిల్లల సంగతి కూడా అంతేనా? అంటే సమాధానం రాదు. ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100’ చిత్రాలను ప్రేక్షకులే ఆదరించారు కాబట్టి అలాంటి చిత్రాలను తీయకుండా ఉండలేం అంటారు.
ఇక తాజాగా తమిళం నుంచి తెలుగులోకి వస్తున్న ఓవియా రెచ్చిపోయి నటించిన ‘90ఎంఎల్, ఏడు చేపల కథ, చీకటి గదిలో చితక్కొట్టుడు’ వంటి చిత్రాల టీజర్స్‌ని చూస్తేనే అందులోని వల్గారిటీ అర్ధమవుతోంది. ఇక తాజాగా తమిళంలో విడుదలైన ‘ఇస్పేట్ రాజావుమ్.. ఇదయ రాణియుం’ పరిస్థితి కూడా ఇదే. ప్రతి విషయానికి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని దాడులు చేసే కులసంఘాలు, ప్రేక్షకులు ఇలాంటి చిత్రాల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నాయి. జనాలకు అతి తక్కువ డబ్బుతో కూడిన వినోదాన్ని ఇలా అభాసుపాలు చేయడం సరికాదు. మరి కొన్ని అనవసర విషయాల విషయంలో నానాయాగీ చేసే సెన్సార్‌బోర్డ్స్ ఇలాంటి సినిమాల విషయంలో మౌనంగా ఎందుకు ఉంటున్నాయి.? మన దేశం, మన సంప్రదాయాలు, మన సంస్కృతి అని వాదించి, ప్రేమికుల రోజున అన్నాచెల్లెళ్లు కనిపించినా బలవంతపు పెళ్లిలు చేయబోయే సనాతన సంప్రదాయ వాదులు ఇలాంటి చిత్రాల విషయంలో ఎందుకు స్పందించరు? వంటి ప్రశ్నలకు సమాధానమే లేదు.
కొద్దిరోజుల కిందట ‘ఆర్‌ఎక్స్100’ చిత్రం ప్రేరణతో ఓ ఘోరం జరిగింది. తాజాగా ‘కేజీఎఫ్’ తరహాలో మరో హత్య జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు యువతను ఆ దిశగా నడిపిస్తున్న చిత్ర యూనిట్స్‌పై క్రిమినల్ కేసులు, గూండాయాక్ట్‌తో కూడిన నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో అర్ధం కాని పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం, ప్రైవేటీకరణ వంటి వాటి వల్ల వస్తున్న ప్రతిఫలం ఇదేనా అని బాధ వేయకమానదు.