అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్ తో సినిమాని తెరకెక్కిస్తూ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాడు. ఇప్పటివరకు సాదా సీదా స్టార్స్ తో సినిమాలు చేసి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మొదటిసారి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమా తర్వాత మహేష్ కి స్టోరీ లైన్ వినిపించడం. అది మహేష్ కి నచ్చడంతో.... పూర్తి కథతో రమ్మని అనిల్ కి చెప్పడం.. అనిల్ కూడా పూర్తి కథతో మహేష్ ని మెప్పించాడట. ఇక మహర్షి సినిమా మేలో విడుదలవుతుండగా... తర్వాత జూన్ నుండి అనిల్ రావిపూడి - మహేష్ ల సినిమా పట్టాలెక్కబోతుందని సమాచారం. ఈ సినిమా మొత్తం అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు స్క్రిప్ట్ లో మంచి యాక్షన్ అంశాలు కూడా ఉంటాయట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన అనిల్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తల మునకలై ఉన్నాడట.. ఇక ఈ సినిమాలో అనిల్, మహేష్ ని ఒక పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడని... అది కూడా ఓ మిలటరీ ఆపీసర్‌గా చూపించబోతున్నాడని తెలుస్తోంది. సెలవల కోసం ఇంటికి వచ్చిన ఓ మిలటరీ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథకు కావాల్సిన కామెడీ... అలాగే కావాల్సిన యాక్షన్ ని జోడించి ఈ సినిమాని అనిల్ తెరకెక్కించబోతున్నాడట. మరి అనిల్ తొలి చిత్రం పటాస్ లో కళ్యాణ్ రామ్ ని పోలీస్ గానే చూపించాడు.
ఇక సుప్రీంలో సాయి ధరమ్ ని కార్ డ్రైవర్ గా, రాజా ది గ్రేట్ లో రవితేజని.. బ్లైండ్ అండ్ అండర్ కవర్ కాప్ గా చూపించిన అనిల్ రావిపూడి ఎఫ్ 2 లో హీరోలిద్దరిని కామెడీగా ప్రెజెంట్ చేసాడు. ఇక మహేష్ సినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. మరి దూకుడు సినిమాలో మహేష్ కామెడీ పండించడం చూసాం. ఇక అనిల్ రావిపూడి, మహేష్ తో ఎంత కామెడీ చేయిస్తాడో అనేది చూడాలి. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక చేపట్టిన అనిల్... విజయశాంతిని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసాడని.... మరో కీలక పాత్ర కోసం ఉపేంద్రని సంప్రదించగా.. ఆయన నో చెప్పాడట.