డబ్బుతో రాజకీయాలు, వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను రాజకీయ నాయకులుగా ప్రోత్సహిస్తే వారు ఎన్నికల ముందే కాదు.. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీలకే జే కొడతారనేది నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదంతం ద్వారా తెలుస్తోంది. అసలు డబ్బును, ఆర్థిక స్తోమతనే ప్రామాణికంగా తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు చంద్రబాబుకే కాదు.. జగన్‌కి కూడా తప్పవనేది నిత్య సత్యం. ఈ విషయంలో కాస్త పవన్ బెటర్‌గా ఉన్నాడు. జీరో బడ్జెట్‌తో ఎన్నికలకు వెళ్లాలని ఆయన చెబుతున్నాడు. ఆయన మాటలకు రాను రాను ప్రాధాన్యం పెరుగుతోంది. సామాజిక సేవలో ముందున్న పలువురు జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం నిజంగా ఆ పార్టీకి పెద్ద ఊపునిచ్చిందనే చెప్పాలి. జేడీ లక్ష్మీనారాయణకు జగన్ కేసుతో సహా పలు విషయాలలో డబ్బు మనిషి కాదని, తనకంటూ కొంత ఐడియాలజీ ఉందనే మాట వినిపిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆయన ఆయనతో పాటు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీకి మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలోకి రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే.
మరోవైపు పవన్ అటు వామపక్షాలతో పాటు వ్యూహాత్మకంగా బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతితో జోడీ కట్టి బహుజనులను ఆకట్టుకోవడంలోనే కాదు.. ఏపీలో ఉన్న దళిత రిజర్వ్ సీట్లను వారికి ఇవ్వడం ద్వారా తన తెలివిని ప్రదర్శించాడు. ఇక మాయావతిని ప్రధానిగా చూడాలనేది తన కోరికతోపాటు కోట్లాది మంది కోరిక అని తెలిపాడు. అలా ఆయన మాయావతిని పీఎం బరిలోకి తెచ్చాడు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బిజెపికి, కాంగ్రెస్‌కి పూర్తి మెజార్టీ రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయి. ఇప్పటివరకు ప్రధాని రేసులో మమతా బెనర్జీ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు తాజాగా మాయావతి పేరు వినిపిస్తోంది.
ఇక పవన్ తాజాగా మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీర్ హామీ ఇచ్చారని, కానీ అది చేయలేదని తప్పుపట్టాడు. సో.. ఇలాంటి దళిత కార్డు అనేది బిఎస్పీ, వామపక్షాల పుణ్యమా అని జనసేనకి ఉపయోగపడే అవకాశం ఉందనేది మాత్రం వాస్తవం.